‘సుక్మా’ ఘటనపై సీఆర్పీఎఫ్‌ సీరియస్‌ | Sukma Attack: CRPF Commandant Transferred | Sakshi
Sakshi News home page

‘సుక్మా’ ఘటనపై సీఆర్పీఎఫ్‌ సీరియస్‌

Published Sun, Mar 18 2018 1:32 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Sukma Attack: CRPF Commandant Transferred - Sakshi

సుక్మా జిల్లాలో మందుపాతర పేలుడు జరిగిన ప్రాంతం (ఫైల్‌)

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రవాద ప్రభావిత సుక్మా జిల్లాలో ఈనెల 13వ తేదీన మందుపాతర పేలుడు ఘటనలో 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవటంపై సీఆర్పీఎఫ్‌ తీవ్రంగా స్పందించింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందంటూ 212వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఆఫీసర్‌(సీవో) ప్రశాంత్‌ ధర్‌ను ఈశాన్య సెక్టార్‌కు బదిలీ చేసింది. ఈ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 13వ తేదీన ఉదయం కిష్టారం– పలోడీ గ్రామాల మధ్య మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగినందున, నిర్మాణంలో ఉన్న ఆ ఐదు కిలోమీటర్ల రహదారిపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) భట్నాగర్‌ హెచ్చరికలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే రోజు సాయంత్రం ఆ మార్గంలో సిబ్బందితో వెళ్తున్న మైన్‌ప్రూఫ్‌ వాహనాన్ని(ఎంపీవీ)మావోయిస్టులు పేల్చేశారు. దీంతో అందులోని 11మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

డీజీ హెచ్చరికల నేపథ్యంలో రెండు ఎంపీవీల్లో సిబ్బంది వెళ్లాల్సి ఉండగా ఒక్క దానిలోనే బయలుదేరారు. ఏ పరిస్థితుల్లో కమాండెంట్‌ ధర్‌ ఇలాంటి ఆదేశాలు ఇచ్చారో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆయన అజాగ్రత్త కారణంగానే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కొద్ది జాగ్రత్తలతో నివారించగలిగిన ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement