సుక్మా దాడి ప్రతీకారంగానే..!
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రతీకార చర్య అని మావోయిస్టు పార్టీ తెలిపింది. అశేష ప్రజల అణచివేతకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు దండకారణ్య మావోయిస్టు స్పెషల్ జనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఈ దాడి చేశామని, పోలీసులపై వ్యక్తిగత కక్ష్యతో కాదని పేర్కొన్నారు. సుక్మా దాడితో తమపై హింసావాదులనే ముద్రవేస్తసున్నారని, కానీ అణగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు.
మావోయిస్టుల సమాచారం తెలుపాలంటూ భద్రతా బలగాలు గిరిజనులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని రహస్యంగా మట్టుబెడుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశసంపదను దోచుకుంటున్నదని విమర్శించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.