Sukma attack
-
సుక్మా జిల్లాలో మావోయిస్ట్‌ల అలజడి
ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు. -
‘సుక్మా’ ఘటనపై సీఆర్పీఎఫ్ సీరియస్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రవాద ప్రభావిత సుక్మా జిల్లాలో ఈనెల 13వ తేదీన మందుపాతర పేలుడు ఘటనలో 11 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవటంపై సీఆర్పీఎఫ్ తీవ్రంగా స్పందించింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందంటూ 212వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీసర్(సీవో) ప్రశాంత్ ధర్‌ను ఈశాన్య సెక్టార్‌కు బదిలీ చేసింది. ఈ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉదయం కిష్టారం– పలోడీ గ్రామాల మధ్య మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగినందున, నిర్మాణంలో ఉన్న ఆ ఐదు కిలోమీటర్ల రహదారిపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్(డీజీ) భట్నాగర్ హెచ్చరికలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే రోజు సాయంత్రం ఆ మార్గంలో సిబ్బందితో వెళ్తున్న మైన్‌ప్రూఫ్ వాహనాన్ని(ఎంపీవీ)మావోయిస్టులు పేల్చేశారు. దీంతో అందులోని 11మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. డీజీ హెచ్చరికల నేపథ్యంలో రెండు ఎంపీవీల్లో సిబ్బంది వెళ్లాల్సి ఉండగా ఒక్క దానిలోనే బయలుదేరారు. ఏ పరిస్థితుల్లో కమాండెంట్ ధర్ ఇలాంటి ఆదేశాలు ఇచ్చారో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆయన అజాగ్రత్త కారణంగానే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కొద్ది జాగ్రత్తలతో నివారించగలిగిన ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు విచారణలో వెలుగు చూస్తాయని చెప్పారు. -
సుక్మా దాడి ప్రతీకారంగానే..!
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రతీకార చర్య అని మావోయిస్టు పార్టీ తెలిపింది. అశేష ప్రజల అణచివేతకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు దండకారణ్య మావోయిస్టు స్పెషల్ జనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఈ దాడి చేశామని, పోలీసులపై వ్యక్తిగత కక్ష్యతో కాదని పేర్కొన్నారు. సుక్మా దాడితో తమపై హింసావాదులనే ముద్రవేస్తసున్నారని, కానీ అణగారిన వర్గాల ప్రజల బాగు కోసం ఇలాంటి చర్యలు తప్పవని తెలిపారు. మావోయిస్టుల సమాచారం తెలుపాలంటూ భద్రతా బలగాలు గిరిజనులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని రహస్యంగా మట్టుబెడుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశసంపదను దోచుకుంటున్నదని విమర్శించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 25 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
సుక్మా దాడి వెనుక సూత్రధారి ఇతనే!
-
సుక్మా దాడి వెనుక సూత్రధారి ఇతనే!
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి వెనుక సూత్రధారి ఎవరు అనే దానిపై పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. 24 ఏళ్ల కరుడుగట్టిన మావోయిస్టు కమాండర్ ఈ ఊచకోతకు సూత్రధారి అని తెలుస్తోంది. 25మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఈ మారణకాండకు సీపీఐ (మావోయిస్టు) ఫస్ట్ మిలిటరీ బెటాలియన్ అధినేత మాద్వి హిద్మా వ్యూహరచన చేసినట్టు తెలుస్తున్నదని పోలీసులు బుధవారం తెలిపారు. దక్షిణ సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కిరాతకమైన దాడిలో 25 మంది జవాన్లు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 2010లో సుక్మా పొరుగునున్న దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో 74 మంది జవాన్లు మరణించారు. గత మార్చి 11న 12మంది భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న దాడి వెనుక కూడా హిద్మా అలియాస్ హిద్మాలు, అలియాస్ సంతోష్ కారణమని భావిస్తున్నారు. మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన బస్తర్‌లో హిద్మా కరుడుగట్టిన మావోయిస్టుగా పేరొందాడు. దక్షిణ సుక్మాలోని పుర్వతి గ్రామంలో జన్మించిన అతని నాయకత్వ పరిధిలో ప్రస్తుతం దక్షిణ సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. చూడటానికి బక్కపలుచగా కనిపించే హిద్మా అత్యంత కర్కశమైన రెబల్ నాయకుడిగా పేరొందాడని, అతనికి తన ప్రాంతంనిండా చాలా నమ్మకస్తులైన ఇన్ఫార్మర్లు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. -
మీ నోళ్లు తెరవరేం.. అవి ప్రాణాలు కావా?
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దారుణ మారణకాండలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించినా మానవహక్కుల సంఘాలు ఎందుకు నోళ్లు తెరవడం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అడవుల్లో దాక్కుంటూ విధ్వంసం సృష్టిస్తున్న మావోయిస్టులది పిరికిపందల చర్య అని ఆయన మండిపడ్డారు. జాతి మొత్తం ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి చెందినా.. సానుభూతి పరులు, మానవహక్కుల సంఘాలు మాత్రం సోమవారం నుంచి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని అడిగారు. ఎవరైనా ఒక తీవ్రవాది లేదా ఉగ్రవాదిని పోలీసులు చంపితే వెంటనే చాలా తీవ్రంగా స్పందించే ఈ వర్గాలు.. ఇంత పెద్ద మొత్తంలో జవాన్లు మరణించినా ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మానవ హక్కుల న్యాయవాదుల నుంచి అందుతున్న మద్దతుతోనే మావోయిస్టులు ఇలాంటి హింసాత్మక చర్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తుండటంతో మావోయిస్టులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉండటం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. వీళ్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం సేవ చేస్తున్నారని, ఈ క్రమంలో వాళ్లు తమ అమూల్యమైన జీవితాలనే పణంగా పెట్టారని తెలిపారు. వాళ్ల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత రీతిలో ఆదుకుంటాయని మంత్రి వివరించారు. -
మావోయిస్టులపై పోరాట పంథాను పునఃసమీక్షిస్తాం
8న నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో భేటీ ► కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి ► ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న మావోయిస్టుల తాజా దాడిని కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పెను సవాలుగా తీసుకున్నాయి. సరికొత్త వ్యూహంతో మావోయిస్టులను గట్టి ఎదురుదెబ్బ తీస్తామని ప్రకటించాయి. మావోయిస్టులపై చేస్తున్న పోరాట వ్యూహాన్ని పునఃసమీక్షిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలించడానికి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలన్నింటితో వచ్చే నెల 8న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని, ఇందులో వ్యూహాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నాటి మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్లకు ఆయన మంగళవారం మానా క్యాంపులో నివాళి అర్పించారు. రాష్ట్ర గవర్నర్ బలరామ్‌జీ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, పలువురు పారామిలటరీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మావోయిస్టులు నిరాశా నిస్పృహలతో, పిరికితనంతో పాశవిక దాడికి పాల్పడ్డారని, దీన్ని సవాలుగా స్వీకరిస్తున్నామని రాజ్‌నాథ్ విలేకర్లతో పేర్కొన్నారు. ‘మా సాహస జవాన్ల త్యాగాలు వృథాకావు. వామపక్ష తీవ్రవాద సంస్థలు అభివృద్ధికి వ్యతిరేకం. రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడానికి యత్నిస్తున్నాయి.. మావోయిస్టులు బస్తర్‌లో రోడ్ల అభివృద్ధిని సహించలేకపోతున్నారు. గిరిజనులను మానవ రక్షక కవచాలుగా వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు. రానున్న రోజుల్లో నక్సల్స్ నిరోధక ఆపరేషన్లను మరింత పటిష్టంగా, శక్తిమంతంగా నిర్వహిస్తామని రమణ్ సింగ్ తెలిపారు. ‘సుక్మాలో నక్సల్స్‌పై పోరు దేశంలోనే వామపక్ష తీవ్రవాదంపై పెద్ద పోరాటం. ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను, నిర్మాణ పనులను విస్తృతం చేస్తాం’ అని చెప్పారు. అనంతరం రాజ్‌నాథ్, సీఎంలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. కాగా, దాడిలో చనిపోయిన తమ రాష్ట్ర జవాన్లకు తమిళనాడు ప్రభుత్వం రూ. 20 లక్షలు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ. 5 లక్షలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షలు, పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఇద్దరు హరియాణా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంది. ఛత్తీస్‌గఢ్‌లోనే ఉండండి మావోయిస్టు నిరోధక ఆపరేషన్ల సమన్వయం కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఉండాలని సీఆర్పీఎఫ్ తాత్కాలిక అధిపతి సుదీప్ లఖ్తాకియా, హోం శాఖలోని సీనియర్ సలహాదారు కే.ఆర్ విజయ్‌కుమార్‌లను రాజ్‌నాథ్ ఆదేశించారు. దాడుల్లో నష్టపోతున్న సీఆర్పీఎఫ్ పనితీరుపై అసంతృప్తితో ఆయన ఈమేరకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయుధాల కొరత, నిఘా సమాచార లేమి వంటి సమస్యలను అధిగమించాలని ఆయన బలగానికి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా దాడిలో పాల్గొన్న మావోయిస్టుల లక్ష్యంగా చేపట్టనున్న భారీ ఆపరేషన్ పూర్తయ్యేవరకు ఈ ఇద్దరు అధికారులు రాష్ట్రంలోనే ఉంటారని వెల్లడించాయి. భేటీకి ఏపీ, తెలంగాణ సీఎంలు మే నెల 8న ఢిల్లీలో జరిగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పారామిలటరీ దళాల అధిపతులు కూడా భేటీలో పాల్గొంటారని వెల్లడించారు. నక్సల్స్‌తో రమణ్‌సింగ్ ఒప్పందం: దిగ్విజయ్ ఛత్తీస్ సీఎం రమణ్ సింగ్, ఇతర బీజేపీ నేతలకు నక్సల్స్‌తో బేరసారాల ఒప్పందముందని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ‘రమణ్, బీజేపీ నేతలంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నుంచే ఎన్నికల్లో గెలిచారు. వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి’ అని అన్నారు. 22 ఆయుధాలు అపహరించిన మావోలు చింతూరు (రంపచోడవరం): ఘటనా స్థలం నుంచి మావోలు మొత్తం 22 అత్యాధునిక ఆయుధాలను ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. వీటిలో 12 ఏకే 47లు, 4 ఏకేఎం రైఫిళ్లు , రెండు ఇన్సాస్ ఎల్ఎంజీలు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, 5 వైర్లెస్ సెట్లు, రెండు బైనాక్యులర్లు, 22 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయని, వీటితోపాటు 2820 ఏకే47, ఏకేఎం బుల్లెట్లు, 600 ఇన్సాస్ బుల్లెట్లు, 62 యూబీజీఎల్ బుల్లెట్లను సైతం తీసుకెళ్లారని తెలిపారు. దాడి చేసిన వారిలో 70 శాతం మహిళలే సుక్మా జిల్లాలోని కాలాపత్తర్‌లో సోమవారం సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసిన మావోయిస్టుల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారని ఘటనలో గాయపడిన జవాన్ ఒకరు తెలిపారు. దాడి తర్వాత మృతిచెందిన జవాన్ల తుపాకులను మహిళా మావోలే తీసుకెళ్లారని మరో జవాన్ చెప్పారు. నల్లదుస్తులు ధరించిన 300 మంది మావోలు దాడికి పాల్పడ్డారని, వారిలో కొందరి వద్ద రాకెట్ లాంచర్లు ఉన్నాయన్నారు. భోజనాలు చేస్తుండగా..: కాలాపత్తర్‌లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు రక్షణ కోసం వెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం చేస్తుండగా మావోలు చుట్టుముట్టి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ‘మావోయిస్టులు స్థానికుల సాయంతో జవాన్ల కదలికలను పసిగట్టారు. ఒక టీంలోని 36 మంది జవాన్లు భోజనాలకు కూర్చోగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు విరుచుకుపడి అధునాతన ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించారు’ అని చెప్పారు. గస్తీ కాస్తున్న జవాన్లు దీటుగా కాల్పులు జరిపి, సమీపంలోని 40 మంది పౌరులు, నిర్మాణ కార్మికుల ప్రాణాలను కాపాడగలిగారు’ అని తెలిపారు.