మీ నోళ్లు తెరవరేం.. అవి ప్రాణాలు కావా?
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దారుణ మారణకాండలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించినా మానవహక్కుల సంఘాలు ఎందుకు నోళ్లు తెరవడం లేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అడవుల్లో దాక్కుంటూ విధ్వంసం సృష్టిస్తున్న మావోయిస్టులది పిరికిపందల చర్య అని ఆయన మండిపడ్డారు. జాతి మొత్తం ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి చెందినా.. సానుభూతి పరులు, మానవహక్కుల సంఘాలు మాత్రం సోమవారం నుంచి ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమని అడిగారు.
ఎవరైనా ఒక తీవ్రవాది లేదా ఉగ్రవాదిని పోలీసులు చంపితే వెంటనే చాలా తీవ్రంగా స్పందించే ఈ వర్గాలు.. ఇంత పెద్ద మొత్తంలో జవాన్లు మరణించినా ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మానవ హక్కుల న్యాయవాదుల నుంచి అందుతున్న మద్దతుతోనే మావోయిస్టులు ఇలాంటి హింసాత్మక చర్యలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తుండటంతో మావోయిస్టులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉండటం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు. వీళ్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం సేవ చేస్తున్నారని, ఈ క్రమంలో వాళ్లు తమ అమూల్యమైన జీవితాలనే పణంగా పెట్టారని తెలిపారు. వాళ్ల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత రీతిలో ఆదుకుంటాయని మంత్రి వివరించారు.