
అసెంబ్లీ సీట్లు పెంచండి
♦ కేంద్ర హోంమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
♦ ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరతతో ఇబ్బందులు పడుతున్నాం
♦ రాష్ట్రానికి ఐపీఎస్‌ల సంఖ్యను 141కి పెంచండి
♦ ‘ఉపాధి’ని సాగుతో అనుసంధానించాలని కేంద్ర మంత్రి బీరేంద్రకు విన్నపం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధన మేరకు తెలంగాణలో శాసనసభ స్థానాలను 153కు పెంచేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, పార్టీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, బి.బి.పాటిల్, సీతారాంనాయక్‌తో కలిసి ఆయన రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు.
‘‘తెలంగాణలో జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియ వేగవంతం చేయాలి. అలాగే అఖిల భారత సర్వీసు అధికారుల కొరత కారణంగా తెలంగాణలో అనేక ఇక్కట్లు ఎదురవుతున్నందున త్వరగా ఈ సమస్యను పరిష్కరించండి. ప్రస్తుతం ఐపీఎస్ అధికారులు 123 మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను 141కి పెంచాల్సిన అవసరం ఉంది..’’ అని హోంమంత్రికి విన్నవించారు. తమ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించినట్టు కేటీఆర్ తెలిపారు.
ఉపాధి అనుసంధానంపై పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ
హోంమంత్రిని కలిసిన అనంతరం కేటీఆర్, ఎంపీల బృందం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో భేటీ అయింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా బీరేంద్ర సింగ్‌ను కేటీఆర్ కోరారు. ఈ దిశగా తగు సూచనలు చేయాలని విన్నవించారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు రూపొందించి పంపిస్తే తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకునే దిశగా ఆలోచిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్టు కేటీఆర్ మీడియాకు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న పారిశుధ్య కార్మికులను కూడా ఉపాధి హామీ పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేసినట్టు కేటీఆర్ వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏప్రిల్ 20న రాష్ట్రానికి రావాల్సిందిగా బీరేంద్రసింగ్‌ను ఆహ్వానించామని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి రూ.3 వేల కోట్ల పైచిలుకు ప్రతిపాదనలు ఇచ్చామని, 172 వంతెనల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరామని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను కూడా కేంద్రమంత్రికి వివరించామని, ముఖ్యంగా తాగునీటికి సంబంధించి సాయం అందించాల్సిందిగా కోరినట్లు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన కమిటీ నివేదిక రాగానే తగిన చర్యలు చేపడతామని కేంద్రమంత్రి అన్నట్లు పేర్కొన్నారు.