'ఆధునిక పద్దతులతో పరిష్కరించండి'
లక్నో: ఉగ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కేంద్రహోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లక్నోలో నూతనంగా ప్రారంభించనున్న ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బ్రాంచ్ భవనానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఉగ్రవాద, మావోయిస్టు చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో ఎన్ఐఏ కీలక పాత్ర పోషించిందన్నారు.
'భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం అతి పెద్దది. భద్రతా సమస్యలను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఆధునిక పద్దతులతో పరిష్కరించాలి. కీలకమైన కేసులలో విచారణ, ఇన్వెస్టిగేషన్లను పాత పద్దతులతో చేయలేము. ఈ రోజుల్లో క్రిమినల్స్ కూడా ఆధునిక పద్దతులు అనుసరిస్తున్నారు. ఎన్ఐఏ పనితీరుపై కేవలం మన దేశ ప్రజలే కాదు, మొత్తం ప్రపంచానికే నమ్మకం ఉంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఐఎస్ఐఎస్ సమస్యతో మన దేశానికి ఎలాంటి భయం అవసరం లేదు. మన దేశంలోని ముస్లిం కుటుంబాలు వారి పిల్లలను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షితులు అవ్వకుండా చూడగలుగుతున్నారు'. అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కాగా ఉగ్రవాదులు, మావోయిస్టులకు సంబంధించిన క్లిష్టమైన కేసులను ఎన్ఐఏ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.