రాజనాథ్ పాక్ పర్యటనపై టెన్షన్ టెన్షన్!
లాహోర్: పాకిస్తాన్లో జరగనున్న సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు ఉద్దేశించిన కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ పర్యటన తీవ్ర ఉత్కంఠత రేపుతోంది. ఓ వైపు.. రాజ్నాథ్ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలాహుద్దీన్, మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని జమాత్-ఉద్-దావా చిఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి భద్రతకు సంబంధించిన బాధ్యత ఆతిథ్య దేశానిదే అంటూ భారత విదేశాంగశాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు . అయితే.. పర్యటన విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
కశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో అమాయక ప్రజల మరణానికి రాజనాథ్ సింగ్ కారణమని, ఆయన్ను పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానించడం ద్వారా కశ్మీరీల మనసులు గాయపడుతాయని హఫీజ్ సయీద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2008 ముంబై పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్.. రాజనాథ్ పర్యటనకు వ్యతిరేకంగా ఇస్లమాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్, క్వెట్టా, ముల్తాన్, ఫైసలాబాద్లతో పాటు పాక్లోని ఇతర నగరాల్లో ఆగస్టు 3న ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజనాథ్ పర్యటన టెన్షన్గా మారింది