
కల్లోల కశ్మీర్‌ను చక్కదిద్దేందుకు
సీఎంతో అఖిలపక్షం చర్చలు
- పరిష్కారంపై ఆశాభావం
- ఆహ్వానాన్ని తిరస్కరించిన వేర్పాటువాదులు
శ్రీనగర్: కశ్మీర్‌లో అశాంతియుత పరిస్థితులను చక్కదిద్దడం ధ్యేయంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలోని అఖిలపక్ష బృందం రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటన ఆదివారం ప్రారంభమైంది. 26 మంది సభ్యులతో కూడిన ఈ బృందం శ్రీనగర్ చేరుకున్న వెంటనే సీఎం మెహబూబాతో సమావేశమైంది. కశ్మీర్‌లోయలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించింది. అఖిలపక్ష బృందంలోని నేతలందరూ మాట్లాడుతూ.. లోయలో శాంతిని పునరుద్ధరించేందుకు పరిష్కారాన్ని కనుగొనగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యామంత్రి, రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి నయీం అక్తర్ మాట్లాడుతూ.. సంబంధిత పక్షాలన్నీ చర్చల ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత ఆజాద్ మాట్లాడుతూ అఖిలపక్ష బృందం పర్యటన కశ్మీర్‌కు, దేశానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింసాత్మక అల్లర్లు కొనసాగుతుండడం తెలిసిందే. ఇప్పటివరకు 71 మంది మరణించగా, భారీసంఖ్యలో గాయపడ్డారు.
చర్చలకు వేర్పాటువాదుల తిరస్కారం
అఖిలపక్షంతో సమావేశమవ్వాలన్న సీఎం మెహబూబా ముఫ్తీ ఆహ్వానాన్ని వేర్పాటువాదులు తిరస్కరించారు. తాజా చర్చల ప్రక్రియను ఏమార్చే ప్రయత్నంగా దీన్ని వారు అభివర్ణించారు. మరోవైపు వేర్పాటువాద నేతలను కలుసుకునేందుకు అఖిలపక్ష బృందంలోని పలువురు సభ్యులు విడిగా చేసిన ప్రయత్నం ఫలించలేదు. 60 రోజులుగా గృహనిర్బంధంలో ఉన్న వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీని కలిసేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ఆర్‌జేడీ నేత జయప్రకాశ్ నారాయణ్‌లు ఆయనింటికి వెళ్లగా కనీసం గేటు కూడా తీయలేదు. కాగా, అఖిలపక్షం పర్యటన సందర్భంగా ఆదివారం కశ్మీర్‌లో జరిగిన అల్లర్లలో 200 మంది గాయపడ్డారు.