
గోరక్షణ సంస్థలను నిషేధించాలి
లోక్‌సభలో విపక్ష సభ్యుల డిమాండ్
* దళితులపై దాడుల అంశంపై దిగువసభలో చర్చ
* దళితులు భయాందోళనల్లో బతుకుతున్నారు: కాంగ్రెస్
* దళితులపై దాడులకు వ్యవస్థే కారణం.. ఏ ఒక్కరో కాదు: బీజేపీ
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై అత్యాచారాల ఘటనలు పెరుగుతుండటాన్ని నిరోధించటంలో కేంద్రం విఫలమైందని లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఎస్సీలు, ఎస్టీలు తీవ్ర భయాందోళనల్లో బతుకుతున్నారంటూ.. మతతత్వ గో పరిరక్షక సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల అంశంపై సీపీఎం సభ్యుడు పి.కె.బిజు గురువారం సభలో చర్చను ప్రారంభిస్తూ.. దేశవ్యాప్తంగా దళితుల దీన పరిస్థితుల గురించి ప్రస్తావించారు.
‘ప్రతి రోజూ ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతి 18 నిమిషాలకూ దళితులపై ఒక నేరం జరుగుతోంది. ఈ వర్గానికి చెందిన వారిలో 37.8 శాతం మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో వేరేగా కూర్చుంటున్నారు. దళితుల్లో 24.5 శాతం కన్నా ఎక్కువ మందిని పోలీస్ స్టేషన్లలో ప్రవేశించటానికి అనుమతించటం లేదు’ అని వివరించారు. గో పరిరక్షణ సంఘాలను దేశమంతటా నిషేధించాలన్నారు.
దళితులు తీవ్ర భయం, అభద్రతా భావనలతో జీవిస్తున్నారని కాంగ్రెస్ సభ్యుడు హెచ్‌కే మునియప్ప ఆందోళన వ్యక్తంచేశారు. ‘వారికి తమను రక్షించటానికి సంబంధించి కాంగ్రెస్‌పై నమ్మకముండేది.. కానీ బీజేపీపై నమ్మకం లేదు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీలకు రక్షణ అవసరం ఉండేది కాదు. వాజపేయి ఉన్నప్పుడు అటువంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో దళితులపై దాడులు చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి పెరిగాయని, మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇలాంటివి 14,500 కేసులు నమోదయ్యాయన్నారు. వీహెచ్‌పీని, గో పరిరక్షణ పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు చేస్తున్న గో రక్షా దళ్ సంస్థలను నిషేధించాలని తృణమూల్ సభ్యుడు సౌగతారాయ్ కోరారు.
అధికార బీజేపీ సభ్యుడు ఉదిత్‌రాజ్ తమ పార్టీపై విమర్శలను తిప్పికొడుతూ.. దళితులపై దాడులకు ఏ ఒక్కరూ కారణం కాదని.. వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటుండటం వల్ల దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నట్లవుతోందన్నారు. ఈ చర్చ బీజేపీ, కాంగ్రెస్ లేదా బీజేడీల మధ్య యుద్ధంలా మారకూడదన్నారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతి పాలనలో ఉత్తరప్రదేశ్‌లో దళితులపై పలు దాడులు జరిగాయని.. పదోన్నతుల్లో రిజర్వేషన్ విధానాన్ని సమర్థించేందుకు ఆమె ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టులో ఏమీ చేయలేదని విమర్శించారు.
రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి: రాజ్‌నాథ్
కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు గో పరిరక్షణ వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని.. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వికృత మనస్తత్వంపై అంతా ఐక్యంగా పోరాడాలని పార్టీలకు పిలుపునిచ్చారు. ఆయన చర్చకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడుల ఘటనలు తగ్గాయన్నారు.
దళితులపై దాడులకు సంబంధించి 2013లో 39,346 కేసులు నమోదైతే.. 2014లో 40,300 కేసులు నమోదయ్యాయని.. అవి 2015లో 38,564కు తగ్గాయని పేర్కొన్నారు. అయితే దళితులపై దాడులు కొనసాగుతున్నాయన్న విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుందంటూ.. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఈ అంశంపై సభలో చర్చించాల్సి రావటం విచారకరమన్నారు. దళితులపై దాడుల విషయంలో ప్రధాని మోదీ చాలా కాలం వరకూ ఎందుకు మాట్లాడలేదని విపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలకు బదులుగా.. 1947 నుంచి గత ప్రధానమంత్రులు ప్రతి ఒక్క అంశంపైనా మాట్లాడారా అన్నది విపక్షాలు చెప్పాలన్నారు.
‘ఈ ముసాయిదాను చెత్తబుట్టలో వేయండి’
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను మతపూరితం చేయటానికి, వాణిజ్యపూరితం చేయటానికి ప్రభుత్వం యత్నిస్తోందని.. తన సిద్ధాంతాలను విద్యా రంగంపై రుద్దుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా జాతీయ విద్యా విధానాన్ని చెత్తగా కొట్టివేస్తూ.. దానిని చెత్త బుట్టలో పడవేయాలని కాంగ్రెస్, వామపక్షాలు వ్యాఖ్యానించాయి. తమను కూడా విశ్వాసంలోకి తీసుకుంటూ మళ్లీ కొత్త విధానాన్ని రూపొందించాలని చెప్పాయి.
ముసాయిదాలో ఏ దిశానిర్దేశనమూ లేదని.. నాణ్యత, అందుబాటు, సమానత అనే మూడు ముఖ్యమైన అంశాల గురించి అందులో ఏ ప్రస్తావనా లేదని కాంగ్రెస్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. ముసాయిదా విధానంపై పార్లమెంటు సభ్యుల సూచనలను తీసుకోవటానికి ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.