
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు.
చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు.
గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది.
ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.