‘అసహనం’ తుపాను
న్యూఢిల్లీ: ‘అసహనం’ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోమవారం లోక్‌సభలో అసహనంపై చర్చ వాడీవేడిగా ప్రారంభమైంది. సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం రాజ్‌నాథ్‌పై చేసిన హిందుత్వ వ్యాఖ్యలతో దుమారం రేగింది. సలీం వ్యాఖ్యలను ఖండించిన అధికార పార్టీ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంది. ఇరు పక్షాలు ఆందోళనలకు దిగడంతో లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది.
తొలుత సలీం అసహనంపై చర్చను ప్రారంభిస్తూ మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాక దేశంలో హిందుత్వ నేత అధికారం చేపట్టారని రాజ్‌నాథ్ ఆరెస్సెస్ అంతర్గత భేటీలో చెప్పారంటూ ఓ వార్తా పత్రికను ఉటంకిస్తూ ఆరోపణలు చేశారు. సలీం ఆరోపణలను తీవ్రంగా ఖండించిన రాజ్‌నాథ్.. తన పార్లమెంటరీ జీవితంలో ఇంతగా బాధించిన ఘటన మరొకటి లేదన్నారు. ‘తీవ్ర ఆరోపణ చేశారు. నేను ఆ మాటలు ఎక్కడ.. ఎప్పుడన్నానో చెప్పాలి. లేదా క్షమాపణలు చెప్పాలి. అలా అన్న వ్యక్తికి హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నేను ప్రతి మాటా చాలా జాగ్రత్తగా మాట్లాడతా.
రాజ్‌నాథ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ప్రజలకు తెలుసు’ అని పేర్కొన్నారు. దీంతో.. తనకు ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కలేదంటూ సలీం ఎద్దేవా చేశారు. మంత్రి రాజీవ్ ప్రతాప్‌రూడీతో పాటు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ వ్యాఖ్యల ప్రామాణికతతో పాటు అన్ని అంశాలపై స్పీకర్ పరిశీలించే వరకూ సలీం తన వ్యాఖ్యలను వాపసుతీసుకోవాలన్నారు. దీనికి అంగీకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సలీంను కోరినా.. ఆయన సమ్మతించలేదు. తనకు రాజ్‌నాథ్‌పై ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, పత్రికలో వచ్చిన వ్యాఖ్యలనే ప్రస్తావించానన్నారు.
రాజ్‌నాథ్ అలా మాట్లాడి ఉండకపోతే నవంబర్ 16న వచ్చిన ఈ కథనంపై పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగానే ఆయన సమాచారమివ్వాల్సిందని, ఈ రకంగా ఆయనకు సాయమే చేశానన్నారు. కాగా, తాను ఈ అంశాలను పరిశీలించేవరకూ సలీం మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. అయితే విపక్ష, అధికార పక్షాల ఆందోళనలతో నాలుగుసార్లు సభ వాయిదా పడటంతో సలీం ముందస్తు నోటీసులివ్వనందున ఆయన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో చర్చ మొదలైంది. దేశంలో పెరుగుతున్న అసహన నిరోధంలో ప్రభుత్వం విఫలమైందని సలీం ఆరోపించారు.
మతం పేరుతో అరాచకాలు జరుతున్నా.. మైనారిటీలు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. హరియాణాలో దళిత బాలల దహనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గత 15-16 నెలలుగా జరుగుతున్న ఘటనలు దేశంలో లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. అసహనానికి సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రధాని మౌనం వీడటం లేదని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతఘర్షణలు తగ్గాయంది.
పార్లమెంటు సమాచారం
సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వం వివిధ అంశాలపై వెల్లడించిన వివరాలు.
► 40 మంది అవార్డులు వెనక్కిచ్చారు: దేశంలో అసహనం పెరుగుతోందంటూ 40 మంది కళాకారులు, రచయితలు వారి అవార్డులను సాహిత్య అకాడమీకి తిరిగిచ్చారు.
►35 వేల మంది బాలకార్మికులకు పునరావాసం బాలకార్మిక ప్రాజెక్టు కింద ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి 35వేల మంది బాలకార్మికులకు పునరావాసం కల్పించారు.
► 22 లక్షల టన్నుల పప్పుల దిగుమతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు విదేశాల నుంచి 22.37 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుమతి జరిగింది.
► అంతర్జాతీయ విద్యా సదస్సు వాయిదా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నవంబర్‌లో జరగాల్సిన అంతర్జాతీయ విద్యా సదస్సు అనివార్య కారణాలతో వాయిదా పడింది.
► ‘గీత’ను చేర్చే ప్రతిపాదన లేదు: పాఠశాలల సిలబస్‌లో భగవద్గీత, వేదాలు, ఇతర మతగ్రంథాలను చేర్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు.
భూబిల్లు కమిటీ గడువు పొడిగింపు
వివాదాస్పద భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ గడువును లోక్‌సభ సోమవారం ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజు వరకు పొడిగించింది. దీంతో బిల్లు ఆమోదంపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది.
జీఎస్టీకి మద్దతిస్తాం: మాయావతి
జీఎస్టీ బిల్లు ఉద్దేశం దేశ ప్రయోజనాల కోసమే అయితే దానికి మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. అయితే అసహనం, మతతత్వం, అరాచకాలపై ఆమె ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. హరియాణాలో దళిత బాలల సజీవదహనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని, జైలుకు పంపాలని ఆమె రా జ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో డిమాండ్ చేశారు.