Mohammad Salim
-
వల వేసి ఉచ్చులోకి..!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం టెర్రర్ మాడ్యుల్లో కీలకమని నిర్ధారించారు. ఇతడే మిగిలిన వారిని ఈ ఉచ్చులోకి లాగినట్లు తేల్చారు. భోపాల్‌లో చిక్కిన 11 మందితోపాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మహ్మద్ సలీంగా మారిన సౌరభ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వలసవచ్చాడు. తొలుత సైదాబాద్‌లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. ఇతడు కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్ తయారు చేయడానికే హైదరాబాద్ చేరుకున్నట్లు ఏటీఎస్ చెప్తోంది. అబ్బాస్ కోసం ఆటో ఖరీదు చేసి... సైదాబాద్ నుంచి సలీం తరచూ మలక్‌పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. పేదరికంలో ఉన్న అబ్బాస్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు. ఇలా పూర్తిగా తన మీద ఆధారపడిన అబ్బాస్‌ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్ అంగీకరించాడు. భార్య ద్వారా రెహ్మాన్ పరిచయం నగరంలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో క్లౌడ్ సర్విస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్‌తోపాటు ఇతడి భార్య కూడా మతం మార్చుకుంది. రెహ్మాన్‌ది ఒడిశా కాగా, అతడి భార్యది మధ్యప్రదేశ్. ఈమెకు, సలీం భార్యకు భోపాల్ నుంచే పరిచయం ఉంది. రెహ్మాన్ తన భార్య ద్వారా సలీం భార్యకు... ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడు. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు డెంటిస్ట్ షేక్ జునైద్‌తోపాటు దినసరి కూలీ మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) పరిచయం చేశాడు. ఖరీదు చేసింది మూడు ఎయిర్ గన్స్ ఈ మాడ్యుల్‌కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్ భరించారని అంటున్నారు. గత ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సైదాబాద్ నుంచి అక్బర్‌బాగ్, అక్కడ నుంచి సీతాఫల్మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. సలీం తన మాడ్యుల్‌ను ప్రాక్టీస్ చేయడానికి ఎంజే మార్కెట్ సమీపంలోని ఓ దుకాణం నుంచి మూడు ఎయిర్‌గన్స్, పిల్లెట్స్ కొన్నాడు. వీటిలో రెండే రికవరీ కాగా.. మరోదాని ఆచూకీ లభించలేదు. -
ఈ దొంగనే దోచిన ‘దొంగది’...
కరడుగట్టిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్‌శెట్టి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుకుల చిక్కాడు. తన 16వ ఏటే చోరీల బాట పట్టిన ఇతగాడు.. 27 ఏళ్లలో 150 చోరీలు చేశాడు. 21 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టకుండానేచాకచక్యంగా దొంగతనాలు చేసి ఆ సొమ్ముతో నచ్చినచోట జల్సాలు చేస్తాడు. డబ్బు అయిపోయాక మళ్లీ చోర బాట పడతాడు. అరెస్టయిన ప్రతిసారీ పూర్తి శిక్ష అనుభవించి జైలు నుంచి వస్తుండడంతో ఇప్పటి దాకా అతడిపై ‘పీడీ’ యాక్ట్ప్రయోగించేందుకు పోలీసులకుఅవకాశం లేకపోయింది. సాక్షి,సిటీబ్యూరో: అసలు పేరు మహ్మద్ సలీం.. మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 27 ఏళ్ళ నేర ప్రస్థానంలో 150 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 21 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే ఇతను ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి వచ్చాడు. నాలుగు నెలల్లో 13 నేరాలు చేశాడు... చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలు చేయడంతో పాటు హెలీటూరిజంలో షికారు చేస్తాడు. ఈ ఘరానా దొంగను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, 21 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ తెలిపారు. శుక్రవారం అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. తరువాత ఇల్లు వదిలి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు మాయం చేయడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. ముషీరాబాద్ జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌తో టైంపాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో రంగంలోకి దిగుతాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్ళనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. లోపలకు వెళ్ళాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. కేవలం చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమ, కాలాపత్తర్, కామాటిపుర, హుస్సేనిఆలం, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, బాలాపూర్, పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పరిధుల్లోనే చోరీలు చేశాడు. ఈ దొంగనే దోచిన ‘దొంగది’... ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీ ఖర్చు చేస్తాడు. వ్యభిచారిణుల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్ళాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్ళినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 150 నేరాలు చేసి 21 సార్లు అరెస్టు అయినా శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి రాని నేపథ్యంలో పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యం కాలేదు. గత ఏడాది ఓసారి చిక్కిన సలీం జనవరిలో జైలు నుంచి వచ్చాడు. అప్పటి నుంచి వరుస మూడు కమిషనరేట్లలోని 9 ఠాణాల పరిధిలో 13 నేరాలు చేశాడు. ఇతడి కదలికపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్ వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.21 లక్షల విలువైన 70 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి. -
తలాక్, ఖులా వెంటనే మంజూరు చేయొద్దు
ఖాజీలకు సూచించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం సాక్షి, హైదరాబాద్: ఖాజీలు తలాక్, ఖులా(విడాకుల) ప్రక్రియను వెంటనే మంజూరు చేయవద్దని, భార్యాభర్తల మధ్య సయోధ్య కోసం ప్రయత్నించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం ఖాజీలకు సూచించారు. బుధవారం నాంపల్లి హజ్‌హౌస్‌లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఖాజీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దంపతుల మధ్య విభేదాలు ఏర్పడితే ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి సమస్యను పరిష్కరించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాజీల ప్రక్రియను మెరుగుపరిచేందుకు త్వరలో కేసీఆర్, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు ఖాజీలకు వక్ఫ్ బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని, బోర్డు నుంచి కేవలం వివాహ పుస్తకాలు, దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని ఖాజీలు మీడియాకు వివరించారు. -
‘అసహనం’ తుపాను
న్యూఢిల్లీ: ‘అసహనం’ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సోమవారం లోక్‌సభలో అసహనంపై చర్చ వాడీవేడిగా ప్రారంభమైంది. సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం రాజ్‌నాథ్‌పై చేసిన హిందుత్వ వ్యాఖ్యలతో దుమారం రేగింది. సలీం వ్యాఖ్యలను ఖండించిన అధికార పార్టీ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంది. ఇరు పక్షాలు ఆందోళనలకు దిగడంతో లోక్‌సభ నాలుగుసార్లు వాయిదా పడింది. తొలుత సలీం అసహనంపై చర్చను ప్రారంభిస్తూ మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టాక దేశంలో హిందుత్వ నేత అధికారం చేపట్టారని రాజ్‌నాథ్ ఆరెస్సెస్ అంతర్గత భేటీలో చెప్పారంటూ ఓ వార్తా పత్రికను ఉటంకిస్తూ ఆరోపణలు చేశారు. సలీం ఆరోపణలను తీవ్రంగా ఖండించిన రాజ్‌నాథ్.. తన పార్లమెంటరీ జీవితంలో ఇంతగా బాధించిన ఘటన మరొకటి లేదన్నారు. ‘తీవ్ర ఆరోపణ చేశారు. నేను ఆ మాటలు ఎక్కడ.. ఎప్పుడన్నానో చెప్పాలి. లేదా క్షమాపణలు చెప్పాలి. అలా అన్న వ్యక్తికి హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నేను ప్రతి మాటా చాలా జాగ్రత్తగా మాట్లాడతా. రాజ్‌నాథ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయరని ప్రజలకు తెలుసు’ అని పేర్కొన్నారు. దీంతో.. తనకు ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం దక్కలేదంటూ సలీం ఎద్దేవా చేశారు. మంత్రి రాజీవ్ ప్రతాప్రూడీతో పాటు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ వ్యాఖ్యల ప్రామాణికతతో పాటు అన్ని అంశాలపై స్పీకర్ పరిశీలించే వరకూ సలీం తన వ్యాఖ్యలను వాపసుతీసుకోవాలన్నారు. దీనికి అంగీకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సలీంను కోరినా.. ఆయన సమ్మతించలేదు. తనకు రాజ్‌నాథ్‌పై ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని, పత్రికలో వచ్చిన వ్యాఖ్యలనే ప్రస్తావించానన్నారు. రాజ్‌నాథ్ అలా మాట్లాడి ఉండకపోతే నవంబర్ 16న వచ్చిన ఈ కథనంపై పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగానే ఆయన సమాచారమివ్వాల్సిందని, ఈ రకంగా ఆయనకు సాయమే చేశానన్నారు. కాగా, తాను ఈ అంశాలను పరిశీలించేవరకూ సలీం మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. అయితే విపక్ష, అధికార పక్షాల ఆందోళనలతో నాలుగుసార్లు సభ వాయిదా పడటంతో సలీం ముందస్తు నోటీసులివ్వనందున ఆయన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో చర్చ మొదలైంది. దేశంలో పెరుగుతున్న అసహన నిరోధంలో ప్రభుత్వం విఫలమైందని సలీం ఆరోపించారు. మతం పేరుతో అరాచకాలు జరుతున్నా.. మైనారిటీలు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, మౌనం పాటిస్తోందని మండిపడ్డారు. హరియాణాలో దళిత బాలల దహనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గత 15-16 నెలలుగా జరుగుతున్న ఘటనలు దేశంలో లౌకిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. అసహనానికి సంబంధించి వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రధాని మౌనం వీడటం లేదని ఆరోపించారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతఘర్షణలు తగ్గాయంది. పార్లమెంటు సమాచారం సోమవారం లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వం వివిధ అంశాలపై వెల్లడించిన వివరాలు. ► 40 మంది అవార్డులు వెనక్కిచ్చారు: దేశంలో అసహనం పెరుగుతోందంటూ 40 మంది కళాకారులు, రచయితలు వారి అవార్డులను సాహిత్య అకాడమీకి తిరిగిచ్చారు. ►35 వేల మంది బాలకార్మికులకు పునరావాసం బాలకార్మిక ప్రాజెక్టు కింద ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి 35వేల మంది బాలకార్మికులకు పునరావాసం కల్పించారు. ► 22 లక్షల టన్నుల పప్పుల దిగుమతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు విదేశాల నుంచి 22.37 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుమతి జరిగింది. ► అంతర్జాతీయ విద్యా సదస్సు వాయిదా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నవంబర్‌లో జరగాల్సిన అంతర్జాతీయ విద్యా సదస్సు అనివార్య కారణాలతో వాయిదా పడింది. ► ‘గీత’ను చేర్చే ప్రతిపాదన లేదు: పాఠశాలల సిలబస్‌లో భగవద్గీత, వేదాలు, ఇతర మతగ్రంథాలను చేర్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. భూబిల్లు కమిటీ గడువు పొడిగింపు వివాదాస్పద భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ గడువును లోక్‌సభ సోమవారం ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల చివరి రోజు వరకు పొడిగించింది. దీంతో బిల్లు ఆమోదంపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. జీఎస్టీకి మద్దతిస్తాం: మాయావతి జీఎస్టీ బిల్లు ఉద్దేశం దేశ ప్రయోజనాల కోసమే అయితే దానికి మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. అయితే అసహనం, మతతత్వం, అరాచకాలపై ఆమె ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. హరియాణాలో దళిత బాలల సజీవదహనంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని, జైలుకు పంపాలని ఆమె రా జ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో డిమాండ్ చేశారు.