తలాక్, ఖులా వెంటనే మంజూరు చేయొద్దు
ఖాజీలకు సూచించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం
సాక్షి, హైదరాబాద్: ఖాజీలు తలాక్, ఖులా(విడాకుల) ప్రక్రియను వెంటనే మంజూరు చేయవద్దని, భార్యాభర్తల మధ్య సయోధ్య కోసం ప్రయత్నించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం ఖాజీలకు సూచించారు. బుధవారం నాంపల్లి హజ్‌హౌస్‌లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఖాజీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దంపతుల మధ్య విభేదాలు ఏర్పడితే ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి సమస్యను పరిష్కరించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాజీల ప్రక్రియను మెరుగుపరిచేందుకు త్వరలో కేసీఆర్, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు ఖాజీలకు వక్ఫ్ బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని, బోర్డు నుంచి కేవలం వివాహ పుస్తకాలు, దరఖాస్తులు మాత్రమే తీసుకుంటామని ఖాజీలు మీడియాకు వివరించారు.