సలీమ్
కరడుగట్టిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్‌శెట్టి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుకుల చిక్కాడు. తన 16వ ఏటే చోరీల బాట పట్టిన ఇతగాడు.. 27 ఏళ్లలో 150 చోరీలు చేశాడు. 21 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టకుండానేచాకచక్యంగా దొంగతనాలు చేసి ఆ సొమ్ముతో నచ్చినచోట జల్సాలు చేస్తాడు. డబ్బు అయిపోయాక మళ్లీ చోర బాట పడతాడు. అరెస్టయిన ప్రతిసారీ పూర్తి శిక్ష అనుభవించి జైలు నుంచి వస్తుండడంతో ఇప్పటి దాకా అతడిపై ‘పీడీ’ యాక్ట్‌ప్రయోగించేందుకు పోలీసులకుఅవకాశం లేకపోయింది.
సాక్షి,సిటీబ్యూరో: అసలు పేరు మహ్మద్ సలీం.. మారు పేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 27 ఏళ్ళ నేర ప్రస్థానంలో 150 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 21 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే ఇతను ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి వచ్చాడు. నాలుగు నెలల్లో 13 నేరాలు చేశాడు... చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలు చేయడంతో పాటు హెలీటూరిజంలో షికారు చేస్తాడు. ఈ ఘరానా దొంగను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, 21 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ తెలిపారు. శుక్రవారం అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మార్చిన ‘ఆమె’ పరిచయం...
ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. తరువాత ఇల్లు వదిలి చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌లో కార్మికుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు మాయం చేయడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. ముషీరాబాద్ జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు.
ఇంటి తాళం ముట్టనే ముట్టడు...
పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌తో టైంపాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో రంగంలోకి దిగుతాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్ళనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. లోపలకు వెళ్ళాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. కేవలం చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమ, కాలాపత్తర్, కామాటిపుర, హుస్సేనిఆలం, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, బాలాపూర్, పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పరిధుల్లోనే చోరీలు చేశాడు.
ఈ దొంగనే దోచిన ‘దొంగది’...
ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్‌లో సంచరించే హెలీటూరిజం కోసం భారీ ఖర్చు చేస్తాడు. వ్యభిచారిణుల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్ళాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్ళినా కలవడం సాధ్యం కాలేదు.
ఇప్పటి వరకు 150 నేరాలు చేసి 21 సార్లు అరెస్టు అయినా శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి రాని నేపథ్యంలో పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యం కాలేదు. గత ఏడాది ఓసారి చిక్కిన సలీం జనవరిలో జైలు నుంచి వచ్చాడు. అప్పటి నుంచి వరుస మూడు కమిషనరేట్లలోని 9 ఠాణాల పరిధిలో 13 నేరాలు చేశాడు. ఇతడి కదలికపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్ వర్మ, జి.వెంకట రామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.21 లక్షల విలువైన 70 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్‌శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి.
Comments
Please login to add a commentAdd a comment