వల వేసి ఉచ్చులోకి..! | Mohammed Salim is key in the city terror module | Sakshi
Sakshi News home page

వల వేసి ఉచ్చులోకి..!

Published Mon, May 15 2023 3:48 AM | Last Updated on Mon, May 15 2023 3:48 AM

Mohammed Salim is key in the city terror module - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఫార్మాస్యూటికల్‌ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ మహ్మద్‌ సలీం టెర్రర్‌ మాడ్యుల్‌లో కీలకమని నిర్ధారించారు. ఇతడే మిగిలిన వారిని ఈ ఉచ్చులోకి లాగినట్లు తేల్చారు. భోపాల్‌లో చిక్కిన 11 మందితోపాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్‌ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

మహ్మద్‌ సలీంగా మారిన సౌరభ్‌ రాజ్‌ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వలసవచ్చాడు. తొలుత సైదాబాద్‌లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. ఇతడు కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్‌ తయారు చేయడానికే హైదరాబాద్‌ చేరుకున్నట్లు ఏటీఎస్‌ చెప్తోంది. 

అబ్బాస్‌ కోసం ఆటో ఖరీదు చేసి... 
సైదాబాద్‌ నుంచి సలీం తరచూ మలక్‌పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

పేదరికంలో ఉన్న అబ్బాస్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు. ఇలా పూర్తిగా తన మీద ఆధారపడిన అబ్బాస్‌ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్‌  అంగీకరించాడు.  

భార్య ద్వారా రెహ్మాన్‌ పరిచయం 
నగరంలోని ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో క్లౌడ్‌ సర్విస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రెహ్మాన్‌తోపాటు ఇతడి భార్య కూడా మతం మార్చుకుంది. రెహ్మాన్‌ది ఒడిశా కాగా, అతడి భార్యది మధ్యప్రదేశ్‌. ఈమెకు, సలీం భార్యకు భోపాల్‌ నుంచే పరిచయం ఉంది. రెహ్మాన్‌ తన భార్య ద్వారా సలీం భార్యకు... ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్‌ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడు.

గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు డెంటిస్ట్‌ షేక్‌ జునైద్‌తోపాటు దినసరి కూలీ మహ్మద్‌ హమీద్‌తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్‌లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ను (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) పరిచయం చేశాడు. 

ఖరీదు చేసింది మూడు ఎయిర్‌ గన్స్‌
ఈ మాడ్యుల్‌కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్‌ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్‌ భరించారని అంటున్నారు. గత ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

సైదాబాద్‌ నుంచి అక్బర్‌బాగ్, అక్కడ నుంచి సీతాఫల్‌మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్‌ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. సలీం తన మాడ్యుల్‌ను ప్రాక్టీస్‌ చేయడానికి ఎంజే మార్కెట్‌ సమీపంలోని ఓ దుకాణం నుంచి మూడు ఎయిర్‌గన్స్, పిల్లెట్స్‌ కొన్నాడు. వీటిలో రెండే రికవరీ కాగా.. మరోదాని ఆచూకీ లభించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement