
15వ విడత రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ వ్యాఖ్య
51వేల మందికి నియామక పత్రాల జారీ
న్యూఢిల్లీ: దేశ యువతకు ఉపాధి అవకాశాలు ప్రతిఏటా పెరిగేలా తమ ప్రభుత్వం విధానపర నిర్ణయాలు అమలుచేస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 15వ విడత రోజ్‌గార్ మేళలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి నియామక పత్రాలను మోదీ వర్చువల్‌గా అందజేసి ప్రసంగించారు.
‘‘అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్ కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సైతం స్పష్టంచేసింది. దేశంలోని ప్రతి రంగంలోనూ ఉపాధి అవకాశాలు ఏటికేడు పెరుగుతూనే ఉంటాయి. ఆటోమొబైల్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లో ఉత్పత్తి, ఎగుమతులు నూతన రికార్డులను నెలకొల్పాయి. ఈ రంగాలు నూతన ఉద్యోగాల కల్పన మరింత ఎక్కువైంది’’అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పోలిస్తే ప్రస్తుతం ఎంతో మార్పులొచ్చాయని చెప్పారు.
‘‘2014 ఏడాది ముందువరకు నదీజలాల ద్వారా సరకు రవాణా 1.8 కోట్ల టన్నులు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 15.5 కోట్ల టన్నులకు పెరిగింది. నదీజల మార్గాలు గతంలో ఐదు ఉంటే ఇప్పుడవి 110కి పెరిగాయి. గతంలో 2,700 కిలోమీటర్ల పొడవునా రాకపోకలు జరిగేవి. ఇప్పుడు నదీజలాల్లో 5,000 కిలోమీటర్ల పొడవునా రాకపోకలు జరుగుతున్నాయి. ప్రతి రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఈ ఏడాది యూపీఎస్‌సీ తుది ఫలితాల్లోనూ టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలే. త్వరలో ముంబైలో జరగబోయే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(వేవ్స్) భారతీయ యువత తమ డిజిటల్ నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఒక చక్కటి అవకాశం’’అని మోదీ అన్నారు.