ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్‌బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. ‘ఉపాధిపై ఆర్‌బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు– నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్‌బీఐ గణాంకాలు మూయించాయి’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment