న్యూఢిల్లీ: మౌలిక, అనుబంధ రంగాల్లో వడివడిగా అభివృద్ధి అడుగులు పడుతుండటం వల్లే దేశంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 71,426 మందికి శుక్రవారం నియామక పత్రాలను ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందజేశారు.
రోజ్‌గార్ మేళాలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఎంపికైన సిబ్బందితో మోదీ కొద్దిసేపు మాట్లాడారు. ‘ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత, వేగం తెస్తూ కచ్చితమైన కాలవధితో రిక్రూట్‌మెంట్ చేస్తున్నాం. కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలతో కొనసాగుతున్న ఈ రోజ్‌గార్ మేళానే మా ప్రభుత్వ పనితీరుకు చక్కని నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.
విధిలో బాధ్యతగా మెలగండి
నూతన ఉద్యోగాల్లో కొలువుదీరే సిబ్బందిని ఉద్దేశించి మోదీ కొన్ని సూచనలు చేశారు. ‘ వ్యాపారి తన వినియోగదారుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. ఇదే మంత్రం మీ మదిలో ప్రతిధ్వనించాలి. ప్రజాసేవకు అంకితం కావాలి. కార్యనిర్వహణలో పౌరుడి సేవే ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ప్రజాసేవే ముఖ్యం’ అని సూచించారు. ‘ప్రతీ గ్రామం భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగస్వామి అయిననాడు అక్కడ ఉపాధి కల్పన ఎక్కువ అవుతుంది.
టెక్నాలజీని అంతగా అర్థంచేసుకోలేని వారు ఉండేచోట వారికి ఆన్‌లైన్ సేవలు అందిస్తూ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం చిక్కుతుంది. ఇలాంటి కొత్త వ్యాపారాలు చేసేందుకు రెండో శ్రేణి, మూడో శ్రేణి పట్టణాలు అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునే నిరుద్యోగ యువతకు నూతన గుర్తింపును తీసుకొస్తున్నాయి’ అని అన్నారు. ‘భవిష్యత్తులో దేశంలో వివిధ రంగాల్లో మరింతగా ఉపాధి కల్పనకు రోజ్‌గార్ మేళా ఒక ఉత్ప్రేరకంగా పనిచేయగలదు. దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment