ఏడాదిలో అవకాశాల వెల్లువ
నైపుణ్యాలు లేనివారికీ ఉద్యోగాలు
ప్రభుత్వం నుంచి బలమైన మద్దతు
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది.
కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా.
ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు.
రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
భారీగా వ్యయాలు..
‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది.
మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్‌అండ్‌టీ గ్రూప్ హెచ్‌ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు..
విమానాశ్రయాల విస్తరణ.. 220
2025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు
2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు
23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్
35 పార్క్‌ల నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment