మోదీ 3.0పై కార్పొరేట్ల ఆశాభావం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరింత పురోగతి
వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.
– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్
దేశాభివృద్ధి కొనసాగుతుంది
నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.
– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్
కీలక సమయం
భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను.
– ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్
లక్ష్యానికి పటిష్ట పునాదులు
ఎన్‌డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము.
– అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీ
సంస్కరణల అమలు లక్ష్యం
అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం.
– చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐ
ఎకానమీ మరింత స్పీడ్
కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.
– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం
Comments
Please login to add a commentAdd a comment