
20 శాతం పెరగొచ్చని అంచనా
ఇన్‌స్టాహైర్ ప్లాట్‌ఫాం అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీ ఐటీఈఎస్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్విసెస్) రంగం గణనీయంగా వృద్ధి చెందనుంది. ఉద్యోగావకాశాలు 20 శాతం మేర పెరగనున్నాయి. ఏఐ ఆధారిత నియామకాల సేవల ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాహైర్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 42,000 మంది ఉద్యోగార్థుల ప్రొఫైల్స్, 11,000 పైచిలుకు రిక్రూటర్–క్యాండిడేట్ల ఇంటర్వ్యూ వివరాల అధ్యయనం ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. తమ ‘ఇన్‌స్టాహైర్ టెక్ శాలరీ ఇండెక్స్ 2025‘ ప్రకారం అనుభవం, డొమైన్లవ్యాప్తంగా జీతభత్యాల డైనమిక్స్ కూడా మారుతున్నట్లు తెలిపింది.
కొత్త టెక్నాలజీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉద్యోగావకాశాలు 75 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక తాత్కాలిక ఉద్యోగుల గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ విధానాలు కూడా పరిశ్రమ రూపురేఖలను తీర్చిదిద్దడంలో కీలకంగా ఉంటున్నాయని ఇన్‌స్టాహైర్ నివేదిక తెలిపింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ జాబ్ మార్కెట్‌లో పోటీపడేందుకు దాదాపు 40 శాతం మంది ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందడమో లేదా ప్రస్తుతమున్న వాటిని మరింతగా మెరుగుపర్చుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది.
నివేదికలోని మరిన్ని వివరాలు..
⇒ వివిధ స్థాయుల్లో అనుభవమున్న డెవ్‌ఆప్స్ నిపుణులకు, ముఖ్యంగా ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలున్న వారికి 10 శాతం మేర వేతన వృద్ధి ఉంటోంది. 0–5 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రంట్ ఎండ్ డెవలపర్ల వేతనం వార్షికంగా సుమారు రూ. 1.5 లక్షలు తగ్గగా, ఆరేళ్ల పైగా అనుభవమున్న ఫ్రంట్ ఎండ్ నిపుణుల శాలరీలు వార్షికంగా సుమారు రూ. 4 లక్షల మేర పెరిగాయి. మొబైల్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్ విభాగాల్లోనూ ఇదే ధోరణి నెలకొంది.
⇒ బ్యాక్‌ఎండ్ నైపుణ్యాలకు సంబంధించి పైథాన్ నిపుణులకు అత్యధికంగా వేతనాలు ఉంటున్నాయి. ప్రతి అయిదేళ్ల అనుభవానికి వేతనం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. జావాకి కూడా మంచి డిమాండ్ నెలకొంది. ఫ్రెషర్స్ నుంచి పదేళ్ల పైగా అనుభవమున్న వరకు వివిధ స్థాయుల్లోని ఉద్యోగుల వేతనాలు అయిదు రెట్లు పెరిగాయి.
⇒ ప్రతిభావంతులకు హాట్‌స్పాట్‌గా బెంగళూరు కొనసాగుతోంది. దేశీయంగా 35 శాతం మంది టెక్నాలజీ సిబ్బందికి కేంద్రంగా ఉంటోంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్ (చెరి 20 శాతం చొప్పున), పుణె (15 శాతం), చెన్నై (10 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
⇒ చండీగఢ్, జైపూర్, ఇండోర్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు ఆకర్షణీయమైన టెక్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి.
⇒ నిపుణులు, నాన్–మెట్రో ప్రాంతాలకు రీలొకేట్ అయ్యేందుకు రిమోట్ పని విధానంపరమైన వెసులుబాటు ఉపయోగకరంగా ఉంటోంది.
⇒ సైబర్‌సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌ల సారథ్యంలో నియామకాలు జోరందుకోనున్నా యి. ఏఐ అనుభవానికి కంపెనీలు ప్రా ధాన్యం ఇస్తున్నందున వైవిధ్యం కన్నా నైపుణ్యాలను బట్టి నియమించుకునే ధోరణి పెరుగుతోంది.
⇒ కంపెనీలు వినూత్న హైరింగ్ వ్యూహాలను అమలు చేస్తుండటంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెట్టే నిపుణులకు కెరియర్ వృద్ధి మెరుగ్గా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment