
2024–25లో కోటీ 45 లక్షల ఉద్యోగాల సృష్టి... సగటున నెలకు 12 లక్షల ఉద్యోగాల కల్పన
6.4 శాతం ఆర్థిక వృద్ధి రేటు అంచనాతో సానుకూల ఫలితాలు
ఈపీఎఫ్‌వోలో కొత్త సంస్థల నమోదు మాత్రం అంతంతే
న్యూఢిల్లీ: దేశంలోని వ్యవస్థాపక రంగంలో ఉద్యోగ కల్పన జోరుమీద ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రికార్డు స్థాయిలో కోటీ 45 లక్షల కొత్త కొలువులు సృష్టించింది. దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధి అంచనాల నేపథ్యంలో పలు సంస్థల్లో నియామకాలు భారీగా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) గణాంకాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో కోటీ 38 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
సగటున నెలకు 12 లక్షల ఉద్యోగాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 12 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తంగా సృష్టించిన కొత్త కొలువుల సంఖ్య 1,32,25,401. చివరి నెల సగటను కూడా కలుపుకుంటే కోటీ 45 లక్షల కొత్త నియామకాలు జరిగాయి. ఇది 2022–23తో పోల్చితే 7 లక్షలు అధికం.
6.4 శాతం ఆర్థిక వృద్ధి రేటు
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. 2025–26లోనూ దాదాపు ఇదే స్థాయిలో వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో పటిష్ట వృద్ధి కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ జీతాలను నగదు చెల్లింపులకు బదులు బ్యాంక్ ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేసే ట్రెండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగానే వ్యవస్థాపక రంగంలో కొత్త ఉద్యోగాల పెరుగుదల ఈపీఎఫ్‌వో డేటాలో భారీగా నమోదువుతున్నట్లు చెబుతున్నారు.
కొత్త కంపెనీలు తక్కువే
దేశంలో కొత్తగా ఏర్పాటైన సంస్థల సంఖ్య ఈ ఏడాది తక్కువగానే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ఈపీఎఫ్‌ఓలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 2024–25లో కనిష్టంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తం 45,860 కొత్త సంస్థలు ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ అయ్యాయి. అంటే సగటున నెలకు 4,169 సంస్థలు. ఇంత తక్కువ సంఖ్యలో సంస్థలు ఈపీఎఫ్‌వోలో చేరడానికి కారణం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు లేకపోవడమేనని పేర్కొంటున్నారు. 2024 జూలైలో ప్రకటించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్‌సెంటివ్ స్కీమ్ (ఈఎల్‌ఐ) అమల్లోకి వస్తే పరిస్థితి మారుతుందని చెబుతున్నారు.