అధికారులను అప్రమత్తం చేసిన మోదీ
ఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని మరోసారి వణికించిన భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తమయ్యారు. భూకంపం వార్త తెలిసిన వెంటనే ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున భూమి కంపించిందని, అపార నష్టం సంభవించే అవకాశాలున్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నేపాల్ సహా దేశంలో ప్రకంపనలు రేపిన భూకంపంపై కేంద్రహోమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి నేపాల్కు ఎలాంటి సహాయాన్నయినా అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. దేశంలోని సంభవించిన భూకంపం ప్రమాదంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశామని కేంద్రమంత్రి చెప్పారు.
కాగా నేపాల్ భూకంపం విలయం నుంచి ఇంకా తేరుకోకముందే పలు చోట్ల భూప్రకంపనలు ఆందోళన రేకెత్తించాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. కఠ్మాండు విమానాశ్రయంలో ప్రయాణీకులు ఆందోళనతో పరుగులు పెట్టారు. మంగళవారం సంభవించిన భూకంపంలో ఇప్పటికి నేపాల్లో 26మంది, దేశంలో ఏడుగురు చనిపోయినట్టు సమాచారం.