హిమసీమలో స్నేహసుమం | Sakshi Editorial on Narendra Modi Visit to Nepal and Relation Between Two Countries | Sakshi
Sakshi News home page

హిమసీమలో స్నేహసుమం

Published Thu, May 19 2022 12:38 AM | Last Updated on Thu, May 19 2022 7:55 AM

Sakshi Editorial on Narendra Modi Visit to Nepal and Relation Between Two Countries

కాలం మారుతుంది. ప్రభుత్వాలు మారతాయి. వాటితో పాటు పరిస్థితులూ మారతాయి. ఎప్పుడో 1950 నాటి శాంతి, స్నేహ ఒప్పందంతో బలపడిన భారత – నేపాల్‌ మైత్రి రెండేళ్ళ క్రితం చిక్కుల్లో పడింది. గత జూలైలో మారిన ప్రభుత్వంతో మళ్ళీ ఇప్పుడది కొత్త చిగురులు తొడుగుతున్న దృశ్యం ముందుకొచ్చింది. బుద్ధ పూర్ణిమ వేళ భారత ప్రధాని మోదీ ఒకరోజు నేపాల్‌ పర్యటన ప్రతీకాత్మక వేషభాషలకూ, పరిమిత ప్రయోజనాలకే పరిమితమైనప్పటికీ సంబంధాల మెరుగుదలకు ఊపు తెచ్చింది. ప్రాచీన బౌద్ధ సంస్కృతీ వారసత్వానికి పట్టం కట్టేలా భారత్‌ పక్షాన అంతర్జాతీయ కేంద్రా నికి శంకుస్థాపన, 6 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు)– అందుకు సాక్ష్యం. మునుపటి నేపాల్‌ ప్రధాని అయిన కమ్యూనిస్టు ఓలీ హయాంలో సరిహద్దు వివాదాల మొదలు దేశ పటంలోని ప్రాంతాల దాకా కాఠ్మండూతో స్నేహంపై ముసిరిన మబ్బులు చెదిరిపోతుండడం సంతోషకరం.

ఎనిమిదేళ్ళ క్రితం 2014లో తొలిసారిగా భారత దేశ సారథ్యం చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి 5 సార్లు నరేంద్ర మోదీ నేపాల్‌ను సందర్శించారు. బుద్ధ పూర్ణిమ కలిసొచ్చేలా ఆయన చేసిన తాజా పర్యటన ప్రతీకాత్మకమైనది. బౌద్ధంతో ముడిపడ్డ రెండు దేశాల మధ్య ప్రాచీన అనుబంధాల సెంటి మెంట్‌ను గుర్తు చేస్తూనే, వ్యూహాత్మక స్నేహాన్ని పటిష్ఠం చేసుకొనే ప్రయత్నమిది. ప్రధానులిద్దరూ కలసి ‘భారత బౌద్ధ సంస్కృతి, వారసత్వ అంతర్జాతీయ కేంద్రా’నికి శంకుస్థాపన చేశారు. లుంబిని ‘బౌద్ధ భిక్షు క్షేత్రం’లో ఈ కేంద్రం రూపొందుతోంది. బుద్ధుని జన్మస్థానం నేపాల్‌లోని లుంబిని అని పేర్కొని, నేపాలీ అతి జాతీయవాదులను మోదీ తృప్తిపరిచారు. లుంబినికి పెద్ద దూరమేమీ లేని మన కుశీనగర్‌ బుద్ధుని మహా పరినిర్వాణ స్థలి. తాజా అంతర్జాతీయ కేంద్రంతో రెండు దేశాల ఉమ్మడి వారసత్వం పదిలమై, స్నేహం సుస్థిరం కావడం మంచిదే! 

నేపాల్‌ ప్రస్తుత ప్రధాని షేర్‌బహదూర్‌ దేవ్‌బా రూపంలో భారత్‌కు మంచి మిత్రుడు దొరికాడు. అంతకు ముందు పరిస్థితి అందుకు భిన్నం. కారణాలు ఏమైనా, మునుపటి నేపాల్‌ ప్రధాని ఓలీ, మన దేశంతో సంబంధాల విషయంలో పెడగా ఉన్నారు. ఓలీ సర్కారు తన చర్యలతో ఇరుదేశాల బాంధవ్యానికి కొత్త చిక్కులు తెచ్చింది. 2015లో తమ దేశ రాజ్యాంగ రచనలో భారత్‌ జోక్యం చేసుకుంటోందని నేపాల్‌ ప్రభుత్వం ఆరోపించేంత వరకు పరిస్థితి వెళ్ళింది. అలా నేపాల్‌లో భారత్‌ పట్ల నిరసన హెచ్చింది. 2020కి వచ్చేసరికి పరిస్థితి మరింత జటిలమైంది. ఓలీ సర్కారు ఏకంగా భారత భూభాగాలను నేపాల్‌ కొత్త దేశపటంలో చూపింది. ఇక, చైనా ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం లిపూలేఖ్‌ కనుమ వద్ద భారత్‌ రహదారి విస్తరణ పనులు చేపడితే, దాన్నీ సరిహద్దు వివాదం చేశారు. నిర్మాణాలను కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌– యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌– లెనినిస్ట్‌ వ్యతిరేకిం చింది. కాలాపానీ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలంది. నేపాల్‌ ప్రతిపక్షాలు లింపియా« దురా ప్రాంతం తమ దేశంలో భాగమన్నాయి. ఆ వాదనను భారత్‌ గట్టిగా తిప్పికొట్టాల్సి వచ్చింది. 

నేపాల్‌ ప్రధాని దేవ్‌బా గత నెలలో మూడు రోజుల భారత సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలంటూ ఆయనపై గట్టి ఒత్తిడి వచ్చింది. ఆయన మాత్రం సరిహద్దులను రాజకీయం చేయకూడదంటూ చాకచక్యంగా దాటేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజా మోదీ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బుద్ధభూమి లుంబినిలో భేటీ అయిన ఇరుదేశ ప్రధానులూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఆర్థిక, వాణిజ్య, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలనీ సమాలోచన జరిపారు. సాంస్కృతిక, విద్యారంగాల్లో సహకారంపై 6 ఎంఓయూలు చేసుకున్నారు. ఇవన్నీ ఈ పర్యటనలో ఒనగూడిన పరిమిత ప్రయోజనాలు. పొరుగున బౌద్ధ ఉత్సవాలనూ, సంస్థలనూ చైనా ప్రాయోజితం చేస్తోంది. కొత్తగా లుంబిని పక్కనే కట్టిన అంతర్జాతీయ విమానాశ్రయమూ దాని చలవే. దానికి దీటుగా నేపాల్‌తో మన స్నేహగీతం సాగాలంటే నేపాల్‌ మౌలిక వసతుల కల్పనలో మనం భాగం కావాలి. అలాగే, బౌద్ధాన్ని మరింత ఆసరాగా తీసుకోవచ్చు. రెండు దేశాల్లోని పవిత్ర బౌద్ధస్థలాలను కలుపుతూ, పర్యాటక పరిపథాన్ని ఏర్పాటు చేయచ్చు. అది 50 కోట్ల మంది ప్రపంచ బౌద్ధులనూ మానసికంగా మనకు దగ్గర చేస్తుంది. అలాగే, బోలెడు జలవనరులున్నా విద్యుత్‌ కొరత వేధిస్తున్న నేపాల్‌లో జలవిద్యుదుత్పత్తికి సాంకేతిక సహకారం అందించాలి. మన సత్లెజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌కూ, నేపాల్‌ విద్యుత్‌ అథారిటీకీ మధ్య తాజా ఒప్పందం చిరకాల మైత్రికి వారధి కావాలి. 

భౌగోళిక రాజకీయాల్లో ప్రాంతీయ అనివార్యతల రీత్యా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవుల లాంటి అనేక దేశాలతో స్నేహం కీలకమని భారత్‌కూ తెలుసు. దౌత్యనీతితో భారత ఉపఖండంలో శాంతిని సుస్థిరం చేసుకొనే పనిలోనే మనం ఉన్నాం. అందుకే, హిమాలయాలలా భారత – నేపాల్‌ మైత్రి చెక్కుచెదరనిది అంటూ మోదీ చేసిన వ్యాఖ్య లోతైనది. నేపాల్‌ను మచ్చిక చేసుకొని, నేర్పుగా హిమసీమల్లో వివాదాల నిప్పు రాజేయాలన్న చైనా పన్నాగాలకు ఇది ప్రతిస్పందన అనుకోవచ్చు. ఢిల్లీ – కాఠ్మండూల మధ్య జ్వాల రేగితే, చలి కాసుకుందామని చూస్తున్న బీజింగ్‌ కుయుక్తిని మన పొరుగు దేశమూ గుర్తించడం సంతోషం. డ్రాగన్‌ను నమ్ముకొంటే పాకిస్తాన్, శ్రీలంక లాంటి అనుభవాలే మిగులుతాయన్న తత్త్వం నిదానంగానైనా తలకెక్కినట్టుంది. ‘భారత్‌ విశ్వసనీయ మిత్రదేశ’మన్న దేవ్‌బా మాటల్లోని అంతరార్థమూ అదే! మాటలను చేతల్లో చూపడమే మిగిలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement