జవాన్ల మృతదేహాల వద్ద నివాళులర్పిస్తున్న రాజ్ నాథ్, రమణ్ సింగ్
‘సుక్మా’ మృతుల కుటుంబాలకు రూ.38 లక్షల పరిహారం: రాజ్‌నాథ్
రాయ్‌పూర్: ‘మావోయిస్టులు దేశానికి సవాల్. ప్రభుత్వం దాన్ని స్వీకరించింది. వారిపై పోరాడతాం. ఆ సవాల్‌ను సమర్థంగా అధిగమిస్తాం. నక్సల్స్ ముప్పును ఎదుర్కోవడానికి దేశం ఏకతాటిపైకి రావాలి’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం నక్సల్స్ దాడిలో 14 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందిన నేపథ్యంలో రాజ్‌నాథ్ మంగళవారం రాయ్‌పూర్ చేరుకుని భద్రతను సమీక్షించారు. జ వాన్ల భౌతికకాయాల వద్ద నివాళి అర్పించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్ర జవాన్లను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 38 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 65 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
సుక్మా జిల్లాలో 15 రోజులుగా నక్సల్స్ నిరోధక ఆపరేషన్ జరుగుతోందని, అది చాలా ప్రమాదంతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతను సమీక్షించారు. కాగా నక్సల్స్ కాల్పుల్లో గాయపడిన 15 మంది జవాన్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. దోషులను బోనెక్కించాలని రాష్ట్ర గవర్నర్ బీడీ టాండన్‌కు పంపిన సందేశంలో కోరారు. నక్సల్స్ దాడి పిరికిపంద చర్య అని ఆరెస్సెస్ నేత మన్మోహన్ వైద్య దుయ్యబట్టారు. మృతుల్లోని ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్ యాదవ్ రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దాడి రమణ్‌సింగ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, దాన్ని రద్దు చేయాలని మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్న సభ కొన్ని నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళి అర్పించింది.
చెట్లపై నుంచి కాల్పులు జరిపిన నక్సల్స్
సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై మెరుపు దాడి చేసిన నక్సల్స్ చె ట్లపైన తేలికపాటి మెషిన్ గన్(ఎల్‌జీఎం)లు ఉంచుకుని వాటితో జవాన్లపై గుళ్ల వర్షం కురిపించినట్లు అనుమానిస్తున్నారు. చింతగుహ అటవీ ప్రాంతంలో కసల్‌పడ గ్రామం గుండా వెళ్తున్న జవాన్లపై వారు ఇలా కాల్పులకు తెగబడ్డారని ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న పోలీసులు, దాడితీరును విశ్లేషించిన అధికారులు తెలిపారు.
కాగా, నక్సల్స్ సీఆర్‌పీఎఫ్ బలగాలకు చెందిన పలు అత్యాధునిక ఆయుధాలను ఘటనాస్థలి నుంచి తీసుకెళ్లారు. వీటిలో ఏకే 47/56 రకానికి చెందిన 10 తుపాకులు, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 400 రౌండ్ల తుటాలు ఉన్నాయని భద్రతా బలగాల అంచనా నివేదిక పేర్కొంది. జవాన్ల కాల్పుల్లో 14 మంది నక్సల్స్ చనిపోయారని, మరో 15 మంది గాయపడ్డారని తెలిపింది. నక్సల్స్ కొంతమంది మహిళలు, పిల్లలు సహా పలువురు స్థానిక గ్రామస్తులను మానవ కవచాలుగా వాడుకుని కాల్పులు జరిపారని పేర్కొం ది. దండకారణ్యంలోని స్థానిక నక్సల్స్ నేతలు ఈ దాడికి పథకం వేసి అమలు చేయించారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
మృతుల్లో అనంత వాసి
నల్లమాడ: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ అడవుల్లో సోమవారం నక్సల్స్ జరిపిన దాడిలో అనంతపురం జిల్లా నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ కుంచపు రామమోహన్(25) బలయ్యాడు. ఈమేరకు సంబంధిత అధికారులనుంచి కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. రామమోహన్ 2011లో జవాన్‌గా చేరాడని అతని తల్లిదండ్రులు వెంకటస్వామి, క్రిష్టమ్మలు తెలిపారు. అతని మృతివార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.