
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్‌లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.
ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ‍్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ‍్క్షప్తి చేశారు.
గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.
