శాంతిదళం నుంచి ఫైనల్ మిషన్
మావోయిస్టులపై ముప్పేట దాడి
అన్ని విభాగాల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు
ఉధృతంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు
కాలానుగుణంగా కొత్త ఎత్తుగడలు
ఆదిలో పలకరించిన అపజయాలు
లోపాలను సరిదిద్దుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది.
యూపీఏ హయాంలో..
దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్‌గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌ను కేంద్రం ప్రారంభించింది.
మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది.
సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్‌లో పెద్దఎత్తున సీఆర్‌పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు.
నాగా కమాండోలు..
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్‌హంట్‌కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్‌ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది.
వీరి చేతుల్లో అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు.
ఆపరేషన్ సమాధాన్..
యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్‌బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది.
మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు.
గగనతల దాడులు
ఆపరేషన్ సమాధాన్‌తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి.
అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది.
లోపాలను అధిగమిస్తూ..
మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.
సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్‌శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు.
విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు
సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్‌లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి.
సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి.
ఆపరేషన్ కగార్
సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, స్పెషల్ టాస్‌్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా ఉన్న అబూజ్‌మడ్ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.
ఈనెల 5న తుల్‌తులీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment