
ముందే పసిగట్టి కర్రి గుట్టల నుంచి మావోలు మకాం మార్చినట్టు అనుమానాలు
ఎండలో కూంబింగ్‌తో అలిసిపోతున్న భద్రతా బలగాలు
అతికష్టంపై గుట్టలపైకి చేరినా దొరకని మావోల ఆచూకీ
చర్ల: ఆపరేషన్ కర్రి గుట్టల పేరిట భద్రతా బలగాలు భారీ సంఖ్యలో మావోయిస్టుల కోసం జల్లెడ పట్టినా ఫలితం దక్కలేదని తెలుస్తోంది. గడిచిన ఐదారు నెలల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కూంబింగ్ ద్వారా వందలాది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో తమ స్థావరాల నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఆత్మరక్షణ కోసం తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రి గుట్టలకు చేరారు. సమాచారం అందుతుకున్న భద్రతా బలగాలు గత సోమవారం సాయంత్రానికి కర్రిగుట్టలకు చేరుకొని ‘ఆపరేషన్ కర్రిగుట్ట’పేరుతో అధునాతన పరికరాలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో మొదటి మూడురోజుల పాటు తీవ్రంగా గాలించాయి.
గగనతలం నుంచి గాలిస్తూనే శక్తివంతమైన రాకెట్ లాంచర్లను గుట్టలపై జార విడిచారు. మొదటి రెండు రోజులు భారీగా బాంబులు జారవిడిచినట్టు సమీప ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా ధ్రువీకరించారు. అయితే.. 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జవాన్లు నీరసించిపోగా మూడోరోజు 15 మంది, నాలుగోరోజు 25 మంది వడదెబ్బకు గురయ్యారు. కాగా, మూడోరోజు మావోయిస్టులు భద్రతా బలగాలకు తారసపడగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోలు మృతి చెందినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ప్రకటించారు.
కానీ వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకోలేకపోగా, మృతుల వివరాలనూ వెల్లడించలేదు. నాలుగో రోజు నుంచి రాకెట్ లాంచర్లను ప్రయోగించడం ఆపేసిన జవాన్లు.. గాలింపు కొనసాగిస్తూనే శనివారం రాత్రి అతి కష్టంపై కర్రిగుట్టల పైభాగానికి చేరారు. అక్కడ మావోయిస్టులకు సంబంధించిన భారీ గుహ(సొరంగం), అందులో మావోలు తలదాచుకున్న ఆనవాళ్లను గుర్తించారు.
ఎవరెవరు.. ఎందరు?
ఇటు భద్రాద్రి కొత్తగూడెం, అటు ములుగు జిల్లాలను ఆనుకుని పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పూజారికాంకేర్, గలగం, నంబి, భూపాలపట్నం వరకు వ్యాపించి ఉన్న కర్రి గుట్టలను బలగాలు మూడువైపులా చుట్టుముట్టాయి. అయితే, ఆపరేషన్‌ను ముందుగానే గుర్తించిన మోస్ట్ వాంటెడ్ హిడ్మాతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ముఖ్య నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు సైతం కర్రిగుట్టకు నాలుగో వైపు నుంచి దిగి సురక్షిత ప్రాంతానికి చేరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కర్రి గుట్టల్లో వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారని తొలుత, 400 మంది ఉన్నారని ఆ తర్వాత ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేనట్టు తెలుస్తోంది. అయితే మావోయిస్టులు మకాం మార్చారా.. లేక అక్కడే సురక్షిత స్థావరంలో ఉన్నారా అన్నది తేలడం లేదు. ఇక శుక్రవారం కర్రిగుట్టల్లో మావోయిస్టులు తారసపడ్డారని, ఆ సమయాన ఎదురుకాల్పుల్లో 38 మందికి పైగా మావోలు మృతి చెందారని ప్రచారం జరిగినా ఎవరూ నిర్ధారించలేదు. గలగం సమీప అటవీ ప్రాంతంతో ఒక జవాన్ ప్రెజర్ బాంబు తొక్కడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
సుమారు 5 వేల మంది డీఆర్‌జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ విభాగాలకు చెందిన జవాన్లతో మంగళవారం తెల్లవారుజామున ఆరంభమైన ఆపరేషన్ ఆదివారానికి ఆరో రోజుకు చేరినా ఆశించిన ఫలితం లేకపోవడం.. జవాన్లు అలసిపోతుండడంతో ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తారనే ప్రచారం మొదలైంది. అయితే, మరోపక్క కర్రి గుట్టల్లోనే రెండు క్యాంపులను ఏర్పాటు చేస్తారన్న ప్రచారం తాజాగా మొదలుకావడంతో ఏది సరైనదో తేలాల్సి ఉంది.
భారీ గుహ గుర్తింపు
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కూంబింగ్‌కు దిగిన భద్రతా బలగాలు కర్రి గుట్టలపై మావోయిస్టులకు చెందిన ఒక భారీ గుహను గుర్తించారు. ఐదు రోజులపాటు శ్రమించిన భద్రతా బలగాలు శనివారం రాత్రి అతికష్టం మీద కర్రి గుట్టలపైకి చేరుకొని భారీ గుహ (సొరంగం)ను గుర్తించి అందులో టార్చ్ లైట్లు వేస్తూ పరిశీలించాయి. అయితే అందులో భారీ సంఖ్యలో మావోయిస్టులు దాక్కున్నట్లుగా అనుమానిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసినట్టు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు బలగాలు ముందుకు సాగనున్నట్టు సమాచారం. గుహలో మావోయిస్టులు ఉన్నారని, వారి మాటలు వినిపించాయని బలగాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన వీడియోను వారికి పోస్ట్ చేసినట్టు సమాచారం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆ వీడియో సామాజిక మాద్యమాల్లో కూడా చక్కర్లు కొడుతోంది.