ఏమీ తెలియని వయసులోనే.. | Woman Maoists Surrender to Police | Sakshi
Sakshi News home page

ఏమీ తెలియని వయసులోనే..

Published Tue, Apr 15 2025 8:10 AM | Last Updated on Tue, Apr 15 2025 8:11 AM

Woman Maoists Surrender to Police

భర్తతో కలిసి పార్టీలోకి వెళ్లాను..

నన్ను మళ్లీ ఆదరిస్తారని అనుకోలేదు

కన్నీటి పర్యంతమైన ‘మాజీ’ వసంత

కోరుట్ల: ‘అప్పటికి నాది ఏమి తెలియని వయసు.. ఆ సమయంలోనే మావోయిస్టుల్లో కలిశాను. నా భర్త పసుల రాంరెడ్డితో కలిసి కొన్నాళ్లు పనిచేశాను. తరువాత కొంత కాలానికి ఒక్కదానినే బస్తర్‌ డివిజన్‌లో మావోయిస్టు అజ్ఞాతదళాలతో కలిసి పనిచేసిన. నాలుగైదు సార్లు కాల్పుల నుంచి తప్పించుకున్న. ఉత్తర బస్తర్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ పోలీసులకు లొంగిపోయాను. సుమారు 45ఏళ్ల తరువాత మా వాళ్లు నన్ను ఆదరిస్తారని అనుకోలేదు. నా కూతురు భవానీ, కోరుట్ల, కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన బంధువులు అంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. భర్త రాంరెడ్డి చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నా.. బంధువులంతా నా వెంట నిలిచారు’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల లొంగిపోయి.. సుమారు 45 ఏళ్ల తరువాత ఇంటికి తిరిగొచ్చిన మావోయిస్టు వసంత అలియాస్‌ గంబాలు. 

రెండు రోజుల క్రితం ఇంటికి..
రెండురోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వసంతను తన కూతురు భవానీకి అప్పగించి ఇంటికి పంపించిన క్రమంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వసంత బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమెను ఆప్యాయతతో పలకరించి అక్కున చేర్చుకుని కంటతడి పెట్టారు. వసంత కూతురు భవానీ మాట్లాడుతూ తనకు తల్లి లేదని అనుకున్నానని, కానీ బతికే ఉందని తెలిసి ఎంతో సంతోషపడ్డానని చెప్పారు. ఎంత కష్టమైన సరే తన తల్లిని తన వద్దకు తెచ్చుకుని ఆప్యాయంగా చూసుకోవాలని నిర్ణయించుకుని తన పెద్ద నాన్న కుమారుడు పసుల కృష్ణప్రసాద్, అంబేడ్కర్‌ సంఘాల నాయకులు వుయ్యాల నర్సయ్య సాయంతో ఛత్తీస్‌గఢ్‌ వెళ్లానని అక్కడి పోలీసులు పూర్తిగా సహకరించారని పేర్కొన్నారు. 

పార్టీలోనే చనిపోయిందనుకున్నాం: బంధువులు
లొంగిపోయిన మావోయిస్టు పసుల వసంత సోదరి పెద్ద గంబాలు మాట్లాడుతూ.. తమ చెల్లి ఎప్పుడో పార్టీలోనే చనిపోయిందని అనుకున్నామని, ఇప్పటికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మావోయిస్టు పార్టీలో నిర్వహించిన కార్యకలాపాల గురించి పసుల వసంత ఏమీ వెల్లడించలేదు. తనకు పెద్దగా ఏమీ గుర్తులేదని చెప్పడం గమనార్హం. పసుల వసంత అనారోగ్యంతో ఉండటంతోపాటు తెలుగు సరిగా రాకపోవడం.. ఛత్తీస్‌గఢ్‌ వాసులు గోండు భాష ఎక్కువగా మాట్లాడటంతో వివరాల వెల్లడి ఇబ్బందికరంగా మారింది. వసంతకు వచ్చే రివార్డు డబ్బులు త్వరలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కూతురు భవానీ విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement