భార్యతో సహా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో..
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీకి షాక్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు.
దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్‌గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది.
రిక్రూట్‌మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్
గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.
మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్‌గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment