మావోయిస్టుల ఇలాకా పువర్తిలో నేడు పర్యటించే అవకాశం
అగ్రనేత మడావి హిడ్మా సొంత ఊరు పువర్తి
ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాల అధీనంలోకి వచ్చిన గ్రామం
నిరంతరం దాడులు, ప్రతిదాడులతో అట్టుడికే ప్రాంతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి గుండెకాయ వంటి దక్షిణ బస్తర్ ఏరియాలో, ఆ పార్టీ కీలక నేత హిడ్మా స్వగ్రామంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్టు తెలిసింది. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆదివారం (ఈ నెల 15న) ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్లనున్నట్టు సమాచారం.
మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతోపాటు... యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్ ఫైటర్స్ తదితర దళాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
పువర్తి పర్యటన సందర్భంగా హిడ్మా తల్లితోపాటు ఇతర స్థానికులతో అమిత్ షా మాట్లాడనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికవర్గాలు దీనిని ధ్రువీకరించలేదు.
ఎనిమిది నెలలుగా భద్రతా దళాల గుప్పిట్లో...
ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా కేంద్రమైన సుక్మా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మడావి హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. మురియా ఆదివాసీ తెగకు చెందిన హిడ్మా.. 2001లో అజ్ఞాతంలోకి వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, బెటాలియన్ వన్ కమాండర్‌గా ఎదిగారు. పూర్తి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న పువర్తిలో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు.
సుమారు పదేళ్ల ప్రయత్నం తర్వాత 2024 ఫిబ్రవరిలో భద్రతా దళాలు పువర్తికి చేరుకుని క్యాంపు ఏర్పాటు చేయగలిగాయి. దీనితోపాటు దండకారణ్యంలో మావోయిస్టుల కీలక కేంద్రాలైన కొండపల్లి, జీడిపల్లిలోనూ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతున్నాయి.
ప్రతి గా మావోయిస్టులు కూడా ఈ క్యాంపులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఇటీవల జీడిపల్లి క్యాంప్‌పై పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసిన దాడులకు హిడ్మా నేతృత్వం వహించినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి చోట అమిత్ షా పర్యటించనున్నారనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment