ఎన్‌కౌంటర్ మృతులను చూసేందుకు కుటుంబసభ్యులను అనుమతించండి
ఏటూరునాగారం పోలీసులకు హైకోర్టు ఆదేశం ∙తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను చూసేందుకు వారి కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వాలని స్థానిక పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపర్చాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, మత్తు పదార్థం/విషమిచ్చి పట్టుకుని కాల్చి చంపారని, తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని పేర్కొంటూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కాలవల ఐలమ్మ (మీనా) సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.
ఆగమేఘాలపై పోస్టుమార్టం: పిటిషనర్
పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్ వాదనలు వినిపిస్తూ.. ‘భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌గా సృష్టించడం కోసం కాల్పులు జరిపారు. మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయి. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని కోరుతూ ఐలమ్మ ఆదివారమే జిల్లా ఎస్పీకి, ఉన్నతాధికారులకు ఈ మెయిల్ పంపారు. అయినా ఆమెను, కుటుంబసభ్యులను పోలీసులు అనుమతించలేదు.
బూటకపు ఎన్‌కౌంటర్ కానప్పుడు మృతదేహాన్ని చూపించడానికి అభ్యంతరం ఏంటీ?..’అని ప్రశ్నించారు. అయితే అప్పటికే పోస్టుమార్టం ముగిసిపోయిందని జీపీ చెప్పడంతో.. కుటుంబసభ్యులు చూడకముందే ఆగమేఘాల మీద పోస్టుమార్టం ఎందుకు చేశారో పోలీసులు చెప్పాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
నిపుణుల బృందం పోస్టుమార్టం
పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజ్ వాదనలు వినిపిస్తూ.. ‘అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిస్పందించారు. ఎదురుకాల్పుల్లో మరణించిన వారిని భద్రతాపరమైన ఇబ్బందుల దృష్ట్యా సమీప ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఫోరెన్సెక్ నిపుణుల బృందం అక్కడే పోస్టుమార్టం పూర్తి చేసింది. ఈ ప్రక్రియ అంతా వీడియో తీశారు.
మృతదేహాలను అక్కడే ఫ్రీజర్‌లో భద్రపరుస్తారు. కుటుంబసభ్యులు చూడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు..’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తన భర్త మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్‌ను అనుమతించాలని ఏటూరునాగారం ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. పోస్టుమార్టంలో పాల్గొన్న నిపుణులు, వైద్యుల పూర్తి వివరాలు తమ ముందుంచాలని చెబుతూ, తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment