మావోయిస్టు కుటుంబాల్లో మిశ్రమ స్పందన
ఉద్యమ జీవితంలోనే కీలక నేతలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అడవుల జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అనేక మంది వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఉండే ఈ ప్రాంతం మావోలకు ఇలాఖాగా మారింది.
అప్పట్లో పోలీసు బలగాలకు మావోయిస్టులు కంటికి మీద కునుకు లేకుండా చేశారు. కాలక్రమంగా వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. 2026 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
కీలక స్థానాల్లో తెలుగువారు
నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి, సెంట్రల్ పొలిట్‌బ్యూరో కేంద్ర కమిటీ సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు.
» మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా సింగరేణి కోల్ కమిటీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల ఆయన్ను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్టు సమాచారం.
» ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, రాష్ట్ర కమిటీ మెంబర్, కేబీఎం (కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల) కమిటీ కార్యదర్శిగా ఉన్నారు.
» బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ పార్టీ నిర్వహిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నట్టుగా చెబుతారు. ఇదే మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి, అతని సహచరి పుష్ప దండకారణ్యంలోనే ఉన్నారు.
» కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం అగర్‌గూడకు చెందిన చౌదరి అంకుబాయి అలియాస్ అనితక్క దండకారణ్యంలోనే ఉన్నారు. ఒక్కొక్కరి తలపై రూ.20 లక్షలకు పైనే రివార్డులు ఉన్నాయి.
ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు
గత కొంతకాలంగా మావోయిస్టులు చనిపోవడమో, లొంగిపోవడమో జరుగుతోంది. ఐదు దశాబ్దాలకుపైగా పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్(69) గతేడు జూన్‌లో మరణించారు. బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ పత్రికలకు ఎడిటర్‌గా పని చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.
» దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలి జిల్లా ఇన్‌చార్జ్‌గా పనిచేసిన కాసర్ల రవి అలియాస్ అశోక్ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరే కాకుండా కంతి లింగవ్వతోపాటు సీనియర్లను పార్టీ కోల్పోయింది. మూడేళ్ల క్రితం ఉమ్మ డి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూ రు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకా లు చేపట్టింది.
2020లో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో భదత్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు చనిపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ కమిటీ సింగరేణి కారి్మకుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలకే పరిమితమైంది.
అడవి వీడి బయటకు రావాలి
మా చెల్లి నా కోసం వచ్చి అక్కడే ఉండిపోయింది. నేను లొంగిపోయి సాధారణ జీవితం గడు పుతున్నా. మా చెల్లి 36 ఏళ్లుగా పార్టీలోనే ఉంది. అడవి వీడి తిరిగి వస్తే అందరికీ సంతోషం. - చౌదరి చిన్నన్న, చౌదరి అంకుబాయి అన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం అగర్‌గూడ
ఆశయాన్ని చంపలేరు
వ్యక్తులను చంపగలరు గానీ ఆశయాన్ని చంపలేరు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకున్నా అంతిమ విజయం ప్రజలదే. నా స్వార్థం కోసం మా నాన్నను అజ్ఞాతం వీడమని చెప్పలేను. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరిపి పరిష్కారాన్ని వెతకాలి. అంతేకాని ఉద్యమాన్ని అణచడం కాదు. – బండి కిరణ్, మావోయిస్టు నాయకుడు బండి ప్రకాశ్ కొడుకు
జీవించే హక్కును కాపాడాలి
ఆదివాసీలు నేరం చేసినట్టు లక్షల కొద్దీ బలగాలతో అడవుల్లో క్యాంపులను ఏర్పా టు చేసి అమాయకులను చంపేస్తున్నా రు. అడవి, సహజ వనరులను నాశనం చేసి సాధించేదేమిటి? 2005 నుంచి అనేక పేర్లతో ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ఆర్థిక, సామాజిక, అసమానతల కోణంలో చూస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో జరుపు తున్న మరణహోమాన్ని వెంటనే ఆపేయాలి. చర్చలకు పిలవాలి. ప్రతీ ఒక్కరికి జీవించే హక్కును కాపాడాలి. – నక్క నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పౌరహక్కుల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment