mixed response
-
దేశవ్యాప్త సమ్మె పాక్షికం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ప్రారంభమయ్యింది. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజా రవాణా వ్యవస్థ సేవలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సమ్మె పాక్షికంగా విజయవంతమయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు. సానుకూల స్పందన: ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ తదితర జాతీయ కార్మిక సంఘాలు పాలుపంచుకున్నాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. అస్సాం, హరియాణా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బిహార్, పంజాబ్, రాజస్తాన్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సమ్మెకు ప్రజలు మద్దతు తెలిపారని వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మె మంగళవారం కూడా కొనసాగనుంది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఉత్తర భారతంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పలు రైళ్లు రద్దు కావడం, రహదారుల దిగ్బంధనం, ధర్నాలు కనిపించాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ బంద్‌లో ఘర్షణలు జరగలేదు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీతో పాటు కేరళ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బంద్ ప్రభావం కనిపించింది. 40 రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త మోర్చా ఈ బంద్‌ను నిర్వహించింది. తమ పిలుపునకు 23కుపైగా రాష్ట్రాల్లో అనూహ్య, చరిత్రాత్మక స్పందన లభించిందని, అవాంఛనీయ సంఘటన జరగలేదని మోర్చా తెలిపింది. రైతు ఆందోళనలు ఆరంభమై 10 నెలలు అవుతున్న వేళ తాము తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ సహకారం లభించిందని తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఉత్తర భారతదేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అనేక రైళ్లు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. పలుప్రాంతాల్లో ధర్నాల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ పరిసర నగరాలపై బంద్ ఎక్కువ ప్రభావం చూపింది. పంజాబ్‌లో బంద్ అధిక శాతం విజయవంతమైంది. హరియాణాలోని సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్ రహదారులను రైతులు దిగ్బంధించారు. బంద్‌కు కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్‌పార్టీలు, స్వరాజ్ ఇండియా, ఆర్జేడీ మద్దతునిచ్చాయి. బంద్‌కు మద్దతు ఇవ్వమని టీఎంసీ తెలిపింది, అయితే రైతు ఆందోళనకు మద్దతిస్తామని పేర్కొంది. భారత్ బంద్‌తో దేశవ్యాప్తంగా 50 రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. బంద్ అనంతరం అన్ని సర్వీసులను పునరుద్ధరించామన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రైల్‌రోకోలు జరిగాయని, దీంతో సుమారు 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చర్చలే శరణ్యం: తికాయత్ రైతు సమస్యలకు పరిష్కారం కోర్టుల్లో దొరకదని, చర్చలే సమాధానమని రైతు నేత రాకేశ్ తికాయత్ అభిప్రాయపడ్డారు.తమ ఆందోళనలు ఎలా ముగుస్తాయో తెలియదని, కానీ దేశీయ యువత తమతో చేతులు కలిపిందని చెప్పారు. తినే తిండిని మార్కెట్ వస్తువుగా మార్చకుండా ఉండడానికే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. చట్టాల ఉపసంహరణతోనే ఈ ఆందోళనలు ముగుస్తాయని స్పష్టం చేశారు. చట్టాల రద్దు, వ్యవసాయ రంగ ప్రైవేటీకరణను ఆపడం, మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కూడా రైతుల ప్రధాన డిమాండన్నారు. ప్రజలకు ఒక్కరోజు ఇబ్బందులు కలిగిఉండొచ్చని, కానీ రైతుల కోసం మర్చిపోవాలని కోరారు. ఇప్పటివరకు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. -
రష్యా టీకాపై మిశ్రమ స్పందన!
మాస్కో/మయామీ: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకా (స్పుత్నిక్) సిద్దమైందని రష్యా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన కలిగించింది. మూడో దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండానే టీకా (స్పుత్నికను విడుదల చేయడం ఏమాత్రం సరికాదని, మానవ ప్రయోగాల సమాచా రాన్ని డబ్ల్యూహెచ్ఓకు సమర్పించలేదని పలువురు విమర్శలకు దిగగా.. రష్యా మాత్రం తన దారిన తాను ముందుకెళుతోంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల వద్ద టీకా నమోదు ప్రక్రియను పూర్తి చేసి, ఒకట్రెండు వారాల్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్‌కు రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తోందని, తన కుమార్తెకు తొలి దఫా టీకా ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టీకాను లాటిన్ అమెరికా దేశాలతోపాటు ఆసియా దేశాలకూ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. టీకా వేసుకున్న వారిని పరిశీలించేందుకు రష్యా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ సమాచారం ఏదీ? స్పుత్నిక్ టీకాకు చాలా వేగంగా అనుమతులి వ్వడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. సామర్థ్యం, భద్రత వంటి అంశాల్లో స్పుత్నిక్ ఇప్పటికీ ప్రామాణిక పద్ధతులను పాటించ లేదని కాబట్టి ఈ టీకాను వాడటం సరికాదని వీరు అంటున్నారు. తొలి రెండు దశల ప్రయోగాల్లో భాగంగా దాదాపు వంద మందిపై టీకా పరీక్షించారని, మూడో దశలో వేల మందిపై జరపాల్సిన ప్రయోగాలు చేపట్టనే లేదన్నది వీరి అభ్యంతరం. ‘అదృష్టవంతులైతే పనిచేస్తుందేమో’ హైదరాబాద్: రష్యా అభివృద్ధి చేసిన టీకాను ఎక్కువ మందిపై పరీక్షించకపోతే దాని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యురల్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రజలు అదృష్టవంతులైతే టీకా పనిచేస్తుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు తగినన్ని ప్రయోగాలు చేయలేదు. ఎక్కువ మందిలో టీకా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మూడో దశ మానవ ప్రయోగాలు అవసరం’అని చెప్పారు. -
మోదం..ఖేదం
సాక్షి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్ కొన్ని వర్గాల్లో ఆశలు నింపగా మరికొందరికి నిరాశను మిగిల్చింది. కేంద్ర బడ్జెట్లో పెట్రోలు, డీజిల్‌పై ఒక రూపాయి సుంకం పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే లీటరు పెట్రోల్‌పై రూ.2.50, లీటరు డీజిల్‌పై రూ.2.60 ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రతినెలా జిల్లాపై రూ.112కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రెండు సీజన్లకు కలిపి రూ.6వేల ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. తాజా బడ్జెట్లో రైతులకు ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేకున్నా.. రూ.6వేల సాగు సాయాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 4.41లక్షల మంది రైతులు ఉండగా, అయిదు ఎకరాల లోపు పంట భూములున్న రైతులు 4.25లక్షల మందిదాకా ఉంటారని జిల్లా వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంటే 90శాతానికి పైగా రైతులు అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న వారే. దీంతో కేంద్రం నుంచి ప్రతిఏటా రూ.255కోట్ల మేర ఆర్థిక సాయం పెట్టుబడుల కోసం అందనుంది. మహిళా సంఘాలకు మేలు మేలు జిల్లా వ్యాప్తంగా 28,335 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 3,11,685 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఎస్‌హెచ్‌జీల్లోని ఒక మహిళకు రూ.ఒక లక్ష చొప్పున ముద్ర రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ.283.35 కోట్ల మేర రుణాలు అందనున్నాయి. అంతే కాకుండా.. ఒక్కో గ్రూప్‌లోని ఒక్కో మహిళకు జన్‌ధన్ ఖాతాతోపాటు బ్యాంకులో రూ.5వేల చొప్పున ఓవర్ డ్రాఫ్ట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఫలితంగా రూ.156కోట్ల మేర సంఘాలు, మహిళలు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులకు ఊరట కేంద్ర బడ్జెట్ సగటు ఉద్యోగిపైనా కరుణ చూపించినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి నాటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని రూ.5లక్షలుగా ప్రకటించింది. ఈ పరిమితిని తాజా బడ్జెట్లో పెంచకున్నా.. పాత పరిమితినే కొనసాగించనుండడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వార్షిక వేతనంలో ఇతర మినహాయింపులు, సేవింగ్స్ మినహాయించే రూ.5లక్షల సీలింగ్ పెట్టింది. ఇది కనీసం రూ.6లక్షలపైచిలుకు వార్షిక వేతనానికి పన్ను మినహాయింపు లభించినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రమారమి 20వేల మంది ఉండగా, వీరిలో రూ.5లక్షల వేతనం పొందే వారు దాదాపు 5వేల మంది దాకా ఉంటారని అంచనా. ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో వీరందరికీ లబ్ధి చేకూరినట్లేనని పేర్కొంటున్నారు. -
‘భారత్ బంద్’ పాక్షికం
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. కార్యాల యాలు, విద్యాసంస్థలు మూతపడటం, వాహనాలు తిరగకపోవడంతో కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడగా.. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అసలు కనిపించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టగా.. రాంలీలా మైదాన్ వద్ద నిరసన ర్యాలీలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బంద్ విజయవంతమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకోగా.. విఫలమైందని బీజేపీ పేర్కొంది. చెదురుమదురు ఘటనలు బిహార్ రాజధాని పట్నాలో కొన్ని చోట్ల ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టైర్లు మండించి రైలు సర్వీసులకు అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకో వడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతా ల్లో బస్సుల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటులో జాప్యం వల్ల జెహనా బాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మరణించిందని బీజేపీ ఆరోపించింది. ఒడిశాలో రైల్వే ట్రాక్‌లపై కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపుతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించ డంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కేరళలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులతో పాటు ఆటోరిక్షాలు కూడా తిరగకపోవడంతో రోడ్లనీ ఖాళీగా దర్శనమి చ్చాయి. కర్ణాటకలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపించింది. బెంగళూరులో వ్యాపార సంస్థ లు, దుకాణాలు, మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంగళూరులో తెరచి ఉంచిన దుకాణాలు, హోటల్స్‌పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్, ఎస్పీ కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు రోజువారీ కార్యక లాపాల్ని యథావిధిగా కొనసాగిం చాయి. ప్రయాణికుల నిరసనతో జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు ధర్నాను ఉపసం హరించుకున్నారు. తమిళనాడులో బంద్ ప్రభా వం నామమాత్రంగా కనిపించింది. ఢిల్లీలో కార్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు యథావిధిగా తెరచుకున్నాయి. అయితే ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో పాటు పలువురు లెఫ్ట్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ కారణాలతోనే : కేంద్రం అంతర్జాతీయ అంశాల ప్రభావంతోనే పెట్రో ధరలు పెరిగాయని, భారత్ బంద్ పేరిట ప్రతిపక్షాలు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించాయని బీజేపీ ఆరోపించింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజల తాత్కాలిక ఇబ్బంది తమకు తెలుసని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా మని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్ల బంద్ పిలుపును తిప్పికొట్టారని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలు ధర రూ. 39 నుంచి రూ. 71కి పెరిగిందని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాల్సిన తరుణమిది: మన్మోహన్ న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ వ్యవస్థను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి కలిసి సాగాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉద్ఘాటించారు. పెట్రో ధరల పెంపునకు నిరనసగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానం వద్ద నిర్వహించిన ర్యాలీలో కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు దేశ ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సమాజంలోని యువత, రైతులు, సామాన్య ప్రజలు ఇలా అందరూ మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. పార్టీలు చిన్నచిన్న విభేదాల్ని పక్కనపెట్టి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధమైనప్పుడే అది సాధ్యం’ అని పేర్కొన్నారు. మోదీజీ.. ధరలపై మౌనం వీడండి: రాహుల్ ప్రధాని మోదీ పాలనలో దేశంలో విభేదాలు పెచ్చరిల్లుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రతిపక్షాల ఐక్య కూటమి ఓడించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ర్యాలీలో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెరుగుదల, రాఫెల్ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. ‘70 ఏళ్లలో జరగనిది ఈ నాలుగేళ్లలో చేశామని మోదీ చెబుతున్నారు. అది నిజమే. ఎక్కడ చూసినా ఒకరితో మరొకరు గొడవలు పడుతున్నారు. ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించారు. అదే వారు సాధించింది’ అని తప్పుపట్టారు. ఈ ర్యాలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్నాలో బస్సు అద్దాల ధ్వంసం; ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు -
దీదీ చెప్పిందే జరిగింది!
కోల్ కతా: భారత్ బంద్ లో భాగంగా బెంగాల్ లో ట్రేడ్ యూనియన్లు శుక్రవారం చేస్తున్న బంద్ అంతగా ప్రభావం చూపడం లేదు. రైలు, విమానయాన సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. బంద్ కారణంగా జనం రోడ్ల మీదకు రావడం లేదు. బస్సు సర్వీసులు మామూలుగానే నడుస్తున్న బంద్ కారణంగా వాటిలో జనం కనిపించడం లేదు. ట్యాక్సీ, ఆటోలు కూడా రోడ్లెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే ఎక్కువమంది ఉద్యోగులు గురువారం రాత్రి సమయంలో పనిచేయడానికే మొగ్గు చూపారు. ట్రేడ్ యూనియన్ల సంఘాలు అక్కడక్కడా ర్యాలీలు నిర్వహించాయి. మరికొన్ని ప్రదేశాల్లో తృణమూల్, సీపీఎం వర్గాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. శిలిగురి వద్ద బంద్ కు మద్దతుగా నిలిచిన సీపీఎం ఎమ్మెల్యే అశోక్ భట్టాచార్య, మరో 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మత గురువుల జాబితాలో మథర్ థెరిస్సాను చేర్చుతుండటంతో ఆ వేడుకను తిలకించేందుకు మమత వాటికన్ సిటీకి శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో బంద్ ఫెయిల్ అవుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే ట్రేడ్ యూనియన్ సంఘాలు మాత్రం బంద్ విజయవంతమైందని ప్రకటించాయి.