దీదీ చెప్పిందే జరిగింది!
కోల్ కతా: భారత్ బంద్ లో భాగంగా బెంగాల్ లో ట్రేడ్ యూనియన్లు శుక్రవారం చేస్తున్న బంద్ అంతగా ప్రభావం చూపడం లేదు. రైలు, విమానయాన సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. బంద్ కారణంగా జనం రోడ్ల మీదకు రావడం లేదు. బస్సు సర్వీసులు మామూలుగానే నడుస్తున్న బంద్ కారణంగా వాటిలో జనం కనిపించడం లేదు.
ట్యాక్సీ, ఆటోలు కూడా రోడ్లెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే ఎక్కువమంది ఉద్యోగులు గురువారం రాత్రి సమయంలో పనిచేయడానికే మొగ్గు చూపారు. ట్రేడ్ యూనియన్ల సంఘాలు అక్కడక్కడా ర్యాలీలు నిర్వహించాయి. మరికొన్ని ప్రదేశాల్లో తృణమూల్, సీపీఎం వర్గాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. శిలిగురి వద్ద బంద్ కు మద్దతుగా నిలిచిన సీపీఎం ఎమ్మెల్యే అశోక్ భట్టాచార్య, మరో 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా మత గురువుల జాబితాలో మథర్ థెరిస్సాను చేర్చుతుండటంతో ఆ వేడుకను తిలకించేందుకు మమత వాటికన్ సిటీకి శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో బంద్ ఫెయిల్ అవుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే ట్రేడ్ యూనియన్ సంఘాలు మాత్రం బంద్ విజయవంతమైందని ప్రకటించాయి.