హెచ్‌ఐఎల్ ఫైనల్ చేరిన ఇరు జట్లు
నేడు తుది పోరు
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్‌పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్‌లో తమిళనాడు డ్రాగన్స్‌పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్‌దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు.
సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి.
బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్‌తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment