Hockey India League
-
హైదరాబాద్ తూఫాన్స్ గెలుపు
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాద్ తూఫాన్స్ షూటౌట్లో సూర్మా హాకీ క్లబ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తరఫున అమన్‌దీప్ లక్రా (40వ నిమిషంలో) గోల్ సాధించగా... సూర్మా హాకీ క్లబ్ తరఫున నికోలస్ డెల్లా (8వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. ఆట ఆరంభంలోనే సూర్మా హాకీ క్లబ్ గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లగా... మూడో క్వార్టర్లో హైదరాబాద్ జట్టు స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో షూటౌట్ అనివార్యమైంది. సడన్ డెత్‌లో గోల్‌కీపర్ డొమినిక్ డిక్సన్ చక్కటి ప్రతిభ కనబర్చడంతో తూఫాన్స్‌కు బోనస్ పాయింట్ లభించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, 2 పరాజయాలు మూటగట్టుకున్న హైదరాబాద్ తూఫాన్స్ 7 పాయింట్లతో పట్టిక ఐదో స్థానంలో కొనసాగుతోంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ రుద్రాస్ జట్టు 3–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌పై విజయం సాధించింది. యూపీ రుద్రాస్ తరఫున ఫ్లోరిస్ (30వ నిమిషంలో), కాన్ రసెల్ (43వ ని.లో), టంగ్యూ కసిన్స్ (54వ ని.లో) తలా ఒక గోల్ కొట్టగా... ఢిల్లీ జట్టు తరఫున జాక్ వెటన్ (29వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడుతుంది. నేటి నుంచి మహిళల లీగ్ మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్ఐఎల్)కు నేడు తెరలేవనుంది. గతంలో కేవలం పురుషుల కోసమే ఈ లీగ్ నిర్వహించగా... ఈ ఏడాది నుంచి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా పోటీలు జరుపుతున్నారు. పురుషుల లీగ్ రూర్కేలాలో జరుగుతుండగా... మహిళల లీగ్ మ్యాచ్‌లు రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో ఢిల్లీ ఎస్జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న ఫైనల్‌తో మహిళల లీగ్ ముగియనుంది. ఆదివారం జరగనున్న తొలి పోరులో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో ఒడిశా వారియర్స్ జట్టు తలపడనుంది. -
బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) శ్రాచి బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ టైగర్స్ 4–1 తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌ను మట్టికరిపించింది. బెంగాల్ టైగర్స్ తరఫున జుగ్రాజ్ సింగ్ (17వ, 38వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తాచాటగా... సుఖ్జీత్ సింగ్ (1వ నిమిషంలో), అభిషేక్ (47వ ని.లో) చెరో గోల్ సాధించారు. ఢిల్లీ పైపర్స్ తరఫున ఫర్లాంగ్ గారెత్ (53వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగాల్ టైగర్స్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో గోనాసిక జట్టు 3–1 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్‌పై గెలుపొందింది. గోనాసిక జట్టు తరఫున సునీల్ విఠలాచార్య (2వ ని.లో), చార్లెట్ విక్టర్ (33వ ని.లో), నీలమ్ సంజీప్ (60వ ని.లో) తలా ఒక గోల్ సాధించగా... హైదరాబాద్ తూఫాన్స్ తరఫున డానియల్ టిమోతీ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం 2 పరాజయాలు మూటగట్టుకున్న గోనాసిక జట్టు 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా... హైదరాబాద్ తూఫాన్స్ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో సూర్మా హాకీ క్లబ్, తమిళనాడు డ్రాగన్స్‌తో యూపీ రుద్రాస్ తలపడుతుంది. -
ప్రేక్షకులకు ప్రవేశం ఉచితం
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని లీగ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటను అభిమానులకు చేరువ చేసేందుకు ఇది సరైన మార్గం అని హెచ్ఐఎల్ గవర్నింగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. డిసెంబర్ 28 నుంచి రూర్కేలాలోని బిర్సా ముండా స్టేడియంలో పురుషుల హెచ్ఐఎల్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. మరోవైపు రాంచీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 26 మధ్య నిర్వహించనున్న మహిళల హెచ్ఐఎల్ లీగ్‌లో 4 జట్లు పాల్గొంటున్నాయి. ‘టికెట్ల విక్రయంతో డబ్బు సంపాదించడంకన్నా... ఆటను అభిమానులకు చేరువ చేయడం ముఖ్యం. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.‘మైదానాల్లోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా... ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి పోరాటాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంది’ అని హెచ్ఐఎల్ గవరి్నంగ్ కమిటీ చైర్మన్ దిలీప్ టిర్కీ అన్నాడు. -
HIL: విక్టర్‌కు రూ. 40 లక్షలు
ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలవుతున్న హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు సంబంధించి పురుషుల విభాగం వేలం కార్యక్రమం సోమవారం ముగిసింది. రెండో రోజు బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ విక్టర్ వెగ్నెజ్కు అత్యధికంగా రూ. 40 లక్షలు లభించాయి. బెల్జియం జట్టులో కీలక సభ్యుడువిక్టర్ను పంజాబ్‌కు చెందిన సూర్మా హాకీ క్లబ్ కొనుగోలు చేసింది. 28 ఏళ్ల విక్టర్ బెల్జియం తరఫున ఇప్పటి వరకు 175 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన బెల్జియం జట్టులో, 2018 ప్రపంచకప్ సాధించిన బెల్జియం జట్టులో విక్టర్ కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. మన వాళ్లకు ఎంతంటే?నెదర్లాండ్స్‌కు చెందిన థియరీ బ్రింక్‌మన్, ఆర్థుర్ వాన్ డోరెన్లను కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రూ. 38 లక్షలకు, రూ. 32 లక్షలకు సొంతం చేసుకుంది. భారత యువ ఆటగాడు మొరాంగ్థిమ్ రబిచంద్రను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 32 లక్షలకు కొనుగోలు చేసింది.భారత్‌కే చెందిన అంగద్‌బీర్ సింగ్‌ను కళింగ లాన్సర్స్ జట్టు రూ. 26 లక్షలకు... హైదరాబాద్ తూఫాన్స్ జట్టు రాజిందర్‌ను రూ. 23 లక్షలకు కైవసం చేసుకుంది. -
కొత్త హంగులతో పునరాగమనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో నిలిచిపోయిన హెచ్‌ఐఎల్‌ను తిరిగి ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్‌కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టును రెసల్యూట్ స్పోర్ట్స్ కంపెనీ సొంతం చేసుకుంది. మహిళల లీగ్ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్ విశేషాలను పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్ ఐదు సీజన్లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి. హెచ్ఐఎల్ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్ రానుంది. భారత మాజీ కెపె్టన్ దిలీప్ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్ఐఎల్కు టిర్కీనే చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. అడగ్గానే హెచ్ఐఎల్ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్ సింగ్ మాట్లాడుతూ... భారత్‌లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. జట్ల వివరాలు పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్ జట్టుకు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్ జట్టుకు రెసల్యూట్ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులుగా కొనసాగనున్నారు. టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతికి చెందిన ఎస్జీ స్పోర్ట్స్ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్ టీమ్‌ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు. » పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్‌లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్‌ను ప్రవేశ పెడుతున్నారు. » పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్‌లను రాంచీలో నిర్వహించనున్నారు. » ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్ ప్లేయర్లు తప్పనిసరి. » డిసెంబర్ 28న ఈ లీగ్ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది. » ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు. » ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు. » 2013లో తొలిసారి నిర్వహించిన హెచ్ఐఎల్లో రాంచీ రైనోస్ టైటిల్ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్‌రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్ చాంపియన్‌గా నిలిచాయి. » పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీ ఆటకు గుడ్‌బై చెప్పిన భారత దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. -
ఏడేళ్ల విరామం తర్వాత...
న్యూఢిల్లీ: ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తిరిగి అభిమానుల మందుకు రానుంది. 2013లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హెచ్ఐఎల్ ఐదు సీజన్ల తర్వాత 2017లో నిలిచిపోయింది. హకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోద ముద్ర లభించింది. ఈ ఏడాది డిసెంబర్ 28న ప్రారంభం కానున్న ఈ లీగ్ సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో 8 జట్లు (చెన్నై, లక్నో, పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, రాంచీ, హైదరాబాద్)... మహిళల విభాగంలో 6 జట్లు (పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, మరో 2 జట్లను ప్రకటించాలి) పోటీపడతాయి. పురుషుల మ్యాచ్‌లను రౌర్కెలాలో, మహిళల పోటీలను రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల లీగ్ ఫైనల్ వచ్చే ఏడాది జనవరి 26న, పురుషుల తుదిపోరు ఫిబ్రవరి 1న జరగనుంది. లీగ్ కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ప్లేయర్ల వేలం జరగనుంది. మూడు కేటగిరీల్లో (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) ప్లేయర్లను విభజించారు. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. అందులో కనీసం 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ లీగ్‌తో దేశంలో మహిళల హాకీకి మరింత ఆదరణ దక్కుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2017లో చివరిసారి జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో కళింగ లాన్సర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
హెచ్ఐఎల్ కింగ్ కళింగ
చండీగఢ్: పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఇదేనేమో... గత సీజన్ తుదిమెట్టుపై చేజారిన టైటిల్‌ను ఈసారి కళింగ లాన్సర్స్ ఒడిసి పట్టుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో విజేతగా నిలిచింది. ఫైనల్లో కళింగ జట్టు 4–1తో దబంగ్ ముంబైపై జయభేరి మోగించింది. లాన్సర్స్ ఆటగాళ్ల దూకుడుతో మొదలైన ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ రెండు గోల్స్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ రెండు అర్ధభాగాలు ముగిసే సమయానికి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మొదట ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చడంతో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కళింగ లాన్సర్ ఆటగాళ్లు ఒక్కసారిగా చెలరేగారు. దీంతో ఆట మొదలైన మూడో నిమిషంలోనే గ్లెన్ టర్నర్ (18వ నిమిషం) ఫీల్డు గోల్ చేయడంతో కళింగ జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డు గోల్‌కు రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. తర్వాత రెండో క్వార్టర్ కాసేపట్లో ముగుస్తుందనగా మోరిట్జ్ ఫ్యుయరిస్ట్ (30వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో కళింగ 3–0తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే మూడో క్వార్టర్లో దబంగ్ ముంబై ఖాతా తెరిచింది. ఆట 33వ నిమిషంలో అఫాన్ యూసుఫ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచడంతో కళింగ ఆధిక్యం 3–1కు తగ్గింది. చివరి క్వార్టర్లో మళ్లీ మోరిట్జ్ (59వ ని.) గోల్ చేయడంతో లాన్సర్ 4–1తో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. విజేతగా నిలిచిన కళింగ లాన్సర్స్‌కు రూ. 2 కోట్ల 50 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. కోటీ 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ 5–4తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. -
ఫైనల్లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో దబంగ్ ముంబై జట్టు 2–0తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలుపొందగా... కళింగ లాన్సర్స్ ‘షూటౌట్’లో 4–3తో యూపీ విజార్డ్స్ జట్టును ఓడించింది. నేడు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
రాంచీ రేస్ నిష్క్రమణ
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో మాజీ చాంపియన్ రాంచీ రేస్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాంచీ రేస్ 6–2 గోల్స్ తేడాతో గెలిచింది. రాంచీ రేస్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ చేయగా, ఇమ్రాన్ ఖాన్ ఒక ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు. ఢిల్లీ జట్టుకు జస్టిన్ రీడ్ ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. నిర్ణీత 10 లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాంచీ జట్టు 23 పాయింట్లతో ఢిల్లీ వేవ్‌రైడర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, ఢిల్లీ వైవ్రైడర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఇప్పటికే దబంగ్ ముంబై, కళింగ లాన్సర్స్ జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. -
యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్ మ్యాచ్ డ్రా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రా అయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 1–1 స్కోరుతో సమంగా నిలిచాయి. యూపీ జట్టు తరఫున పేయ్లెట్ (22వ ని.), ఢిల్లీ జట్టులో రూపిందర్ (22వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ జట్టుతో పంజాబ్ వారియర్స్ జట్టు తలపడుతుంది. -
సెమీస్‌లో దబంగ్ ముంబై
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ముంబై జట్టు 3–2తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లాడిన ముంబై ప్రస్తుతం 33 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
యూపీ విజార్డ్స్ గెలుపు
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ 6–2తో గెలిచింది. యూపీ తరఫున షంషేర్ సింగ్ (5వ ని.లో), అజయ్ యాదవ్ (40వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (58వ ని.లో) ఒక్కో ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేశారు. పంజాబ్ జట్టుకు మిర్కో ప్రుసెర్ (31వ ని.లో) ఏకైక ఫీల్డ్ గోల్ అందించాడు. -
కళింగ లాన్సర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్ గెలుపు
ఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు 6–4తో కళింగ లాన్సర్స్‌పై నెగ్గింది. ఢిల్లీ జట్టులో తల్విందర్ (9వ ని.), సిమోన్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం) చేయగా... జస్టిన్ (29వ ని.), రూపిందర్ (57వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. -
కళింగ, యూపీ మ్యాచ్ డ్రా
లక్నో: హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా కళింగ లాన్సర్స్, యూపీ విజార్డ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్ 2–2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. యూపీ విజార్డ్స్ తరఫున వీఆర్ రఘునాథ్ (15వ ని.), గొంజాలో పేయ్లట్ లు గోల్స్ సాధించగా... కళింగ లాన్సర్స్ తరఫున కెప్టెన్ మోరిట్జ్ ప్యూర్స్టే (15వ ని., 51వ ని.) రెండు గోల్స్‌ను చేశాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
పంజాబ్ వారియర్స్‌ను గెలిపించిన వీర్డెన్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వీర్డెన్ గోల్‌గా మలిచి పంజాబ్‌ను గెలిపించాడు. -
ఢిల్లీకి తొలి విజయం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్టు బోణీ చేసింది. యూపీ విజార్డ్స్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8–1తో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ తరఫున మన్దీప్ సింగ్ రెండు, పర్వీందర్ సింగ్ ఆస్టిన్ స్మిత్ ఒక్కో ఫీల్డ్ గోల్ చేశారు. -
కళింగపై ముంబై జయభేరి
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5–2 స్కోరుతో కళింగ లాన్సర్స్‌ను కంగుతినిపించింది. దీంతో ఏడు మ్యాచ్‌లాడిన ముంబై నాలుగు విజయాలతో 23 పాయింట్లతో పట్టికలో టాప్‌లో నిలిచింది. దబంగ్ దెబ్బకు కళింగ (20) రెండో స్థానానికి పడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు రెచ్చిపోయారు. మ్యాచ్ జరిగే కొద్దీ రెట్టించిన ఉత్సాహంతో కదంతొక్కారు. ఈ జట్టు తరఫున హర్మన్‌ప్రీత్ (23వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా... ఫ్లోరియన్ ఫుచెస్ (31వ ని.), గుర్జంత్ సింగ్ (53వ ని.) ఫీల్డు గోల్స్ చేశారు. దీంతో నిబంధనల ప్రకారం రెండేసి పాయింట్లు లభించాయి. చివర్లో గ్లెన్ టర్నర్ (57వ ని.) ఫీల్డ్ గోల్ చేయడంతో కళింగ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. -
ముంబైకి కళింగ లాన్సర్స్ షాక్
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వరుస విజయాలతో జోరు మీదున్న దబంగ్ ముంబై జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో ముంబై జట్టును బోల్తా కొట్టించింది. కళింగ లాన్సర్స్ తరఫున ఫ్యుర్స్టె మోరిట్జ్ రెండు పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (32వ 33వ ని.లో) చేయగా... బాకెర్ బిల్లీ (40వ ని.లో) ఫీల్డ్ గోల్ సాధించాడు. హెచ్ఐఎల్లో ఒక ఫీల్డ్ గోల్, పెనాల్టీ స్ట్రోక్ రెండు గోల్స్‌తో సమానం. అంతకుముందు ముంబై తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ 27వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చడంతో ముంబై ఖాతాలో మరో గోల్ చేరింది. ఆ తర్వాత ముంబై మరో గోల్ చేసేందుకు ప్రయత్నించినా లాన్సర్స్ అడ్డుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్‌తో రాంచీ రేస్ తలపడుతుంది. -
ముంబై ‘హ్యాట్రిక్’
ముంబై: హాకీ ఇండియా లీగ్‌లో దబంగ్ ముంబై ‘హ్యాట్రిక్’ విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3–2 గోల్స్ తేడాతో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై నెగ్గింది. ముంబై ఆటగాడు యూసుఫ్ (29వ ని. 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. 29వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయడంతో 2 పాయింట్లు లభించాయి. ఢిల్లీ తరఫున రీడ్ (43వ ని.), రూపిందర్ (55వ ని.) చెరో గోల్ చేశారు. -
ముంబై చేతిలో పంజాబ్‌కు షాక్
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ జేపీ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై చేతిలో దారుణ పరాజయం ఎదురైంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 10–4 తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో అన్నీ ఫీల్డ్ గోల్సే నమోదు కావడంతో ఒక్కో గోల్‌కు రెండు పాయింట్లు లభించాయి. ముంబై నుంచి ఆరో నిమిషంలోనే నికిన్ తిమ్మయ్య గోల్‌తో జట్టు 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ (25), ఫ్లోరియన్ (30, 43), యూసుఫ్ (49, 50) గోల్స్ చేశారు. పంజాబ్ నుంచి గోడెస్ (13), అర్మాన్ ఖురేషి (44) చెరో గోల్ చేశారు. శనివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆడుతుంది. -
యూపీ విజార్డ్స్‌పై ముంబై విజయం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబంగ్ ముంబై జట్టు తొలి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ముంబై 4–3 గోల్స్ తేడాతో నెగ్గింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో కళింగ లాన్సర్స్ ఆడుతుంది. -
కళింగ లాన్సర్స్‌కు రెండో విజయం
భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కళింగ లాన్సర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. లాన్సర్స్ జట్టు తరఫున గ్లెన్ టర్నర్ నాలుగు గోల్స్ చేయడం విశేషం. రాంచీ రేస్ జట్టుకు సర్వన్జిత్ సింగ్ రెండు గోల్స్ అందించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో దబంగ్ ముంబై జట్టుతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ తలపడుతుంది. -
ముంబై, రాంచీ మ్యాచ్ డ్రా
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ తలపడుతుంది. -
నేటి నుంచి హాకీ ఇండియా లీగ్
► ప్రారంభ మ్యాచ్‌లో ముంబై, రాంచీ పోరు ► స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ కు నేడు (శనివారం) తెర లేవనుంది. నాలుగు సీజన్లపాటు అభిమానులను ఆకట్టుకున్న ఈ లీగ్ తాజా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్లు తలపడతాయి. పంజాబ్ వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. వచ్చే నెల 26 వరకు జరిగే హెచ్ఐఎల్లో మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటిదాకా కనీసం సెమీఫైనల్స్‌కు కూడా చేరుకోలేకపోయిన ముంబై ఈనెల చివరి వరకు ఐదు మ్యాచ్‌లను సొంత వేదికపైనే ఆడనుంది. దీంతో ఈసారి టైటిల్ సాధించాలనే కసితో ఉంది. అష్లే జాక్సన్ , బారీ మిడిల్టన్ , ఫెర్గుస్, గుర్బజ్ సింగ్, కొతజిత్ సింగ్ మన్ ప్రీత్ సింగ్, బీరేంద్ర లక్రాలతో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ వేవ్‌రైడర్స్, పంజాబ్ వారియర్స్, కళింగ లాన్సర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ ఇతర జట్లు. -
హెచ్ఐఎల్ డబ్బుతో వర్సిటీ ఫీజు కట్టుకుంటా: క్రెయిగ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్(హెచ్ఐఎల్) కొందరి హాకీ ఆట గాళ్ల పాలిట వరమైంది. దేశవాళీ ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లకూ కల్పతరువైంది. ఈ లీగ్ పుణ్యమాని ఆస్ట్రేలియా ఆట గాడు టామ్ క్రెయిగ్ తన ఉన్నత చదువులకు కావాల్సిన డబ్బు ను సంపాదించుకోగలిగాడు. ఆసీస్ యువ ఫార్వర్డ్ టామ్ తనకు యూనివర్సిటీ ఫీజును చెల్లించుకునే స్థోమత హెచ్ఐఎల్ వల్లే కలుగుతోందని తెగ సంబరపడుతున్నాడు. కళింగ లాన్స ర్స్ ఫ్రాంచైజీ అతన్ని రూ. 45.65 లక్షలకు (67 వేల డాలర్లు) కొనుగోలు చేసింది. హాకీ ప్లేయర్లకు ఇది భారీ మొత్తమని, దీని వల్ల తన ఆర్థిక అవసరాలు, వర్సిటీ ఫీజు కష్టాలు తొలగిపోతాయని 21 ఏళ్ల టామ్ చెప్పాడు. ఈ నెల 21న హెచ్ఐఎల్ మొదలవనుంది.