రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) శ్రాచి బెంగాల్ టైగర్స్ ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగాల్ టైగర్స్ 4–1 తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌ను మట్టికరిపించింది. బెంగాల్ టైగర్స్ తరఫున జుగ్‌రాజ్ సింగ్ (17వ, 38వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తాచాటగా... సుఖ్‌జీత్ సింగ్ (1వ నిమిషంలో), అభిషేక్ (47వ ని.లో) చెరో గోల్ సాధించారు.
ఢిల్లీ పైపర్స్ తరఫున ఫర్లాంగ్ గారెత్ (53వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగాల్ టైగర్స్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో గోనాసిక జట్టు 3–1 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్‌పై గెలుపొందింది. గోనాసిక జట్టు తరఫున సునీల్ విఠలాచార్య (2వ ని.లో), చార్లెట్ విక్టర్ (33వ ని.లో), నీలమ్ సంజీప్ (60వ ని.లో) తలా ఒక గోల్ సాధించగా... హైదరాబాద్ తూఫాన్స్ తరఫున డానియల్ టిమోతీ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు.
మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం 2 పరాజయాలు మూటగట్టుకున్న గోనాసిక జట్టు 4 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా... హైదరాబాద్ తూఫాన్స్ 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో 2 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో సూర్మా హాకీ క్లబ్, తమిళనాడు డ్రాగన్స్‌తో యూపీ రుద్రాస్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment