ముగిసిన మహిళల హాకీ ఇండియా లీగ్
రన్నరప్‌గా నిలిచిన సూర్మా హాకీ క్లబ్
రాంచీ: మహిళా క్రీడాకారిణుల కోసం తొలిసారి నిర్వహించిన మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో ఒడిశా వారియర్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నేహా గోయల్ సారథ్యంలోని ఒడిశా వారియర్స్ 2-1 గోల్స్ తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టును ఓడించింది. రుతుజా దాదాసో పిసాల్ (20వ, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి ఒడిశా వారియర్స్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
సలీమా టెటె కెప్టెన్సీలో ఆడిన సూర్మా క్లబ్ జట్టుకు పెన్నీ స్క్విబ్ (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. విజేతగా నిలిచిన ఒడిశా వారియర్స్ జట్టుకు రూ. 1 కోటి 50 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ సూర్మా క్లబ్ జట్టుకు రూ. 1 కోటి ప్రైజ్‌మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.
‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు సవితా పూనియా (సూర్మా హాకీ క్లబ్)... ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ పురస్కారం సోనమ్ (సూర్మా హాకీ క్లబ్)... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు జ్యోతి (సూర్మా హాకీ క్లబ్) గెల్చుకున్నారు. ఐదు గోల్స్ చొప్పున సాధించిన యిబ్బీ జాన్సెన్ (ఒడిశా వారియర్స్), చార్లోటి ఎంగ్లెబెర్ట్ (సూర్మా హాకీ క్లబ్) ‘టోర్నీ టాప్ స్కోరర్స్’గా నిలిచారు.
‘టాప్’లో హైదరాబాద్ తూఫాన్స్
పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 17 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. యూపీ రుద్రాస్ జట్టుతో రూర్కెలాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ 3-1తో నెగ్గింది. తూఫాన్స్ జట్టు తరఫున అర్‡్షదీప్ సింగ్ రెండు గోల్స్... పిలాట్ ఒక గోల్ చేశారు.
4 పాల్గొన్న జట్లు
13 మొత్తం జరిగిన మ్యాచ్‌లు
41 నమోదైన మొత్తం గోల్స్
27 ఫీల్డ్ గోల్స్
11 పెనాల్టీ కార్నర్ గోల్స్
3 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్
22 క్రీడాకారిణులకు లభించిన గ్రీన్ కార్డులు
6 క్రీడాకారిణులకు లభించిన ఎల్లో కార్డులు
Comments
Please login to add a commentAdd a comment