
నేటి నుంచి హాకీ ఇండియా లీగ్
భువనేశ్వర్: కొత్త జట్ల తరఫున బరిలోకి దిగే స్టార్ ఆటగాళ్ల హంగామాతో పాటు సరికొత్త స్కోరింగ్ నిబంధనలతో నేటి (సోమవారం) నుంచి హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్‌కు తెర లేవనుంది. 37 రోజుల పాటు అలరించే హెచ్‌ఐఎల్ ఆరంభ మ్యాచ్ కళింగ లాన్సర్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈసారి జరిగే టోర్నీలో ఆటగాళ్లతో పాటు జట్ల యజమానులు, నిర్వాహకులకు కూడా సవాల్‌గానే మారనుంది. మూడేళ్లుగా తమ జట్ల తరఫున బరిలోకి దిగిన ఆటగాళ్లు గతేడాది జరిగిన వేలంలో అటు ఇటు మారారు. దీంట్లో భాగంగా ఢిల్లీ నుంచి సర్దార్ సింగ్ పంజాబ్ వారియర్స్‌కు వెళ్లాడు.
ఈ సీజన్‌లో జట్లకు, ఆటగాళ్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని రూ.5.7 కోట్లకు పెంచారు. అభిమానుల్లో మ్యాచ్‌ల పట్ల ఆసక్తి మరింత పెంచేందుకు నిబంధనలు మార్చారు. దీంట్లో భాగంగా ఆటగాడు ఓ ఫీల్డ్ గోల్ చేసినా, పెనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ చేసినా రెండు గోల్స్‌గా లెక్కిస్తారు. భారత క్రికెట్ వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని సహ యజమానిగా ఉన్న రాంచీ రేస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.