బెంగాల్‌ టైగర్స్‌ విజయ గర్జన | Shrachi Rarh Bengal Tigers team emerged champion in Mens Hockey India League | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ టైగర్స్‌ విజయ గర్జన

Feb 2 2025 3:40 AM | Updated on Feb 2 2025 3:40 AM

Shrachi Rarh Bengal Tigers team emerged champion in Mens Hockey India League

హాకీ ఇండియా లీగ్‌ టైటిల్‌ సొంతం

ఫైనల్లో హైదరాబాద్‌ తూఫాన్స్‌పై 4–3 గోల్స్‌ తేడాతో గెలుపు

జుగ్‌రాజ్‌ సింగ్‌ ‘హ్యాట్రిక్‌’ 

సూర్మా హాకీ క్లబ్‌కు మూడో స్థానం

రూర్కెలా: పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌... ఆ తర్వాత మ్యాచ్‌ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మరో గోల్‌... వెరసి పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో ష్రాచి రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రూపిందర్‌ సింగ్‌ పాల్‌ కెప్టెన్సీలోని బెంగాల్‌ టైగర్స్‌ జట్టు 4–3 గోల్స్‌ తేడాతో హైదరాబాద్‌ తూఫాన్స్‌ జట్టును ఓడించింది. బెంగాల్‌ టైగర్స్‌ జట్టు తరఫున జుగ్‌రాజ్‌ సింగ్‌ (25వ, 32వ, 35వ నిమిషాల్లో) మూడు గోల్స్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయగా... స్యామ్‌ లేన్‌ (54వ నిమిషంలో) గెలుపు గోల్‌ కొట్టాడు. 

హైదరాబాద్‌ తూఫాన్స్‌ తరఫున గొంజాలో పీలాట్‌ (9వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... అమన్‌దీప్‌ లాక్రా (26వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్‌ను పునరుద్ధరించారు. గత ఏడాది డిసెంబర్‌ 28వ తేదీన హాకీ ఇండియా లీగ్‌ మొదలైంది. 

విజేతగా నిలిచిన బెంగాల్‌ టైగర్స్‌ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్‌ హైదరాబాద్‌ తూఫాన్స్‌ జట్టుకు రూ. 2 కోట్లు... మూడో స్థానంలో నిలిచిన సూర్మా హాకీ క్లబ్‌ జట్టుకు రూ. 1 కోటి నగదు పురస్కారం లభించింది. మొత్తం ఎనిమిది జట్లు పోటీపడ్డ హెచ్‌ఐఎల్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక బెంగాల్‌ టైగర్స్‌ జట్టు 19 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. తుదకు బెంగాల్‌ టైగర్స్‌ జట్టుకే టైటిల్‌ లభించడం విశేషం. 

హెచ్‌ఐఎల్‌ ‘బెస్ట్‌ గోల్‌ కీపర్‌’గా బ్రికమ్‌జీత్‌ సింగ్‌ (రూ. 10 లక్షలు; హైదరాబాద్‌ తూఫాన్స్‌)... ‘అప్‌కమింగ్‌ ప్లేయర్‌’గా అర్ష్ దీప్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్‌ తూఫాన్స్‌)... ‘టాప్‌ స్కోరర్‌’గా జుగ్‌రాజ్‌ సింగ్‌ (బెంగాల్‌ టైగర్స్‌; రూ. 10 లక్షలు)... ‘బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ సుఖ్‌జీత్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు; బెంగాల్‌ టైగర్స్‌) ఎంపికయ్యారు. యూపీ రుద్రాస్‌ జట్టుకు ‘ఫెయిర్‌ ప్లే’ అవార్డు లభించింది.  

8 పాల్గొన్న జట్లు 
44 మొత్తం జరిగిన మ్యాచ్‌లు 
199 నమోదైన మొత్తం గోల్స్‌ 
103  ఫీల్డ్‌ గోల్స్‌ 
89 పెనాల్టీ కార్నర్‌ గోల్స్‌  7 పెనాల్టీ స్ట్రోక్‌ గోల్స్‌ 
95 క్రీడాకారులకు లభించిన గ్రీన్‌ కార్డులు 
16 క్రీడాకారులకు లభించిన ఎల్లో కార్డులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement