హాకీ ఇండియా లీగ్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాద్ తూఫాన్స్ షూటౌట్‌లో సూర్మా హాకీ క్లబ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా... విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్‌లో 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తరఫున అమన్‌దీప్ లక్రా (40వ నిమిషంలో) గోల్ సాధించగా... సూర్మా హాకీ క్లబ్ తరఫున నికోలస్ డెల్లా (8వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. ఆట ఆరంభంలోనే సూర్మా హాకీ క్లబ్ గోల్ సాధించి ఆధిక్యంలోకి వెళ్లగా... మూడో క్వార్టర్‌లో హైదరాబాద్ జట్టు స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో షూటౌట్ అనివార్యమైంది.
సడన్ డెత్‌లో గోల్‌కీపర్ డొమినిక్ డిక్సన్ చక్కటి ప్రతిభ కనబర్చడంతో తూఫాన్స్‌కు బోనస్ పాయింట్ లభించింది. తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడి 3 విజయాలు, 2 పరాజయాలు మూటగట్టుకున్న హైదరాబాద్ తూఫాన్స్ 7 పాయింట్లతో పట్టిక ఐదో స్థానంలో కొనసాగుతోంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ రుద్రాస్ జట్టు 3–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌పై విజయం సాధించింది.
యూపీ రుద్రాస్ తరఫున ఫ్లోరిస్ (30వ నిమిషంలో), కాన్ రసెల్ (43వ ని.లో), టంగ్యూ కసిన్స్ (54వ ని.లో) తలా ఒక గోల్ కొట్టగా... ఢిల్లీ జట్టు తరఫున జాక్ వెటన్ (29వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో వేదాంత కళింగ లాన్సర్స్‌తో హైదరాబాద్ తూఫాన్స్ తలపడుతుంది.
నేటి నుంచి మహిళల లీగ్
మహిళల హాకీ ఇండియా లీగ్ (డబ్ల్యూహెచ్‌ఐఎల్)కు నేడు తెరలేవనుంది. గతంలో కేవలం పురుషుల కోసమే ఈ లీగ్ నిర్వహించగా... ఈ ఏడాది నుంచి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా పోటీలు జరుపుతున్నారు. పురుషుల లీగ్ రూర్కేలాలో జరుగుతుండగా... మహిళల లీగ్ మ్యాచ్‌లు రాంచీలో నిర్వహించనున్నారు.
మహిళల విభాగంలో ఢిల్లీ ఎస్జీ పైపర్స్, ఒడిశా వారియర్స్, బెంగాల్ టైగర్స్, సూర్మా హాకీ క్లబ్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న ఫైనల్‌తో మహిళల లీగ్ ముగియనుంది. ఆదివారం జరగనున్న తొలి పోరులో ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో ఒడిశా వారియర్స్ జట్టు తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment