తిరిగి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్
న్యూఢిల్లీ: ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) తిరిగి అభిమానుల మందుకు రానుంది. 2013లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హెచ్‌ఐఎల్ ఐదు సీజన్‌ల తర్వాత 2017లో నిలిచిపోయింది. హకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోద ముద్ర లభించింది.
ఈ ఏడాది డిసెంబర్ 28న ప్రారంభం కానున్న ఈ లీగ్ సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో 8 జట్లు (చెన్నై, లక్నో, పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, రాంచీ, హైదరాబాద్)... మహిళల విభాగంలో 6 జట్లు (పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, మరో 2 జట్లను ప్రకటించాలి) పోటీపడతాయి.
పురుషుల మ్యాచ్‌లను రౌర్కెలాలో, మహిళల పోటీలను రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల లీగ్ ఫైనల్ వచ్చే ఏడాది జనవరి 26న, పురుషుల తుదిపోరు ఫిబ్రవరి 1న జరగనుంది. లీగ్ కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ప్లేయర్ల వేలం జరగనుంది. మూడు కేటగిరీల్లో (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) ప్లేయర్లను విభజించారు. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు.
అందులో కనీసం 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ లీగ్‌తో దేశంలో మహిళల హాకీకి మరింత ఆదరణ దక్కుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2017లో చివరిసారి జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో కళింగ లాన్సర్స్ జట్టు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment