ఫైనల్లో ఢిల్లీ, పంజాబ్
హాకీ ఇండి యా లీగ్
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) రెండో సీజన్‌లో కొత్త చాంపియన్ అవతరించనుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ వేవ్‌రైడర్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి అడుగుపెట్టగా... లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ వారియర్స్ అదే జోరును కొనసాగించి డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రైనోస్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ, పంజాబ్ టైటిల్ పోరులో తలపడతాయి.
ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో ఢిల్లీ 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 15వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఏకైక గోల్ చేసి ఢిల్లీ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. జస్టిన్ రీడ్ అందించిన పాస్‌ను గోల్ పోస్ట్ ముందున్న వాల్మీకి లక్ష్యానికి చేర్చాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తగిన ఫలితం పొందింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు గోల్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా వృథా చేసుకొని మూల్యం చెల్లించుకుంది.
రెండో సెమీఫైనల్లో పంజాబ్ వారియర్స్ 3-2 గోల్స్ తేడాతో రాంచీ రైనోస్‌పై విజయం సాధించింది. పంజాబ్ తరఫున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ (22వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్... అఫాన్ యూసుఫ్ (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. రాంచీ జట్టుకు యాష్లే జాక్సన్ (13వ నిమిషంలో), ఫ్లోరిస్ ఎవర్స్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నిరుటి విజేత రాంచీ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లినా సందీప్ సింగ్ గోల్‌తో పంజాబ్ స్కోరును సమం చేసింది.
ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరి అర్ధభాగంలో పంజాబ్ విజృంభించి నిమిషం తేడాలో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకుంది. చివర్లో రాంచీ ఖాతాలో మరో గోల్ చేరినా చివరి పది నిమిషాలు పంజాబ్ జాగ్రత్తగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.
హాకీ కూడా ‘స్టార్’లోనే
న్యూఢిల్లీ: ఇప్పటికే భారత్‌లో ఐపీఎల్ మినహా అన్ని టోర్నీలతో క్రికెట్ ప్రసారహక్కుల విషయంలో ఆధిపత్యం చలాయిస్తున్న స్టార్ గ్రూప్... ఇక హాకీలోనూ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించనుంది. ఇప్పటికే హెచ్‌ఐఎల్‌ను ప్రసారం చేస్తూ... భారత్‌లో జరిగే అన్ని టోర్నీల ప్రసార హక్కులు దక్కించకున్న స్టార్ గ్రూప్.... తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరిగే హాకీ టోర్నమెంట్‌ల ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.