వారెవ్వా... వారియర్స్
హాకీ ఇండియా లీగ్
విజేత పంజాబ్
ఫైనల్లో కళింగ లాన్సర్స్‌పై గెలుపు
రూ.2.50 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ రూపిందర్
రాంచీ: వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు చివరకు అనుకున్నది సాధించింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్‌లో నూతన చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 6-1 తేడాతో కళింగ లాన్సర్స్‌పై ఘనవిజయం సాధించింది. విజేతగా నిలిచిన పంజాబ్‌కు రూ. 2 కోట్ల 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కగా... రన్నరప్ కళింగకు రూ. కోటీ 75 లక్షలు లభించాయి. పంజాబ్ తరఫున అర్మాన్ ఖురేషి (4వ నిమిషంలో), మాట్ గోడెస్ (39), సత్‌బీర్ సింగ్ (42) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం)తో అదరగొట్టగా... కళింగకు లభించిన ఏకైక గోల్ కెప్టెన్ మోరిట్జ్ అందించాడు. రెండేళ్లుగా తుది మెట్టుపై బోల్తా పడుతూ వచ్చిన పంజాబ్ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదనే కసితో తమ ఆటను ప్రారంభించింది. ఫలితంగా నాలుగో నిమిషంలోనే కళింగకు షాక్ తగిలింది. సర్కిల్‌లో బ్రౌన్ నుంచి అందుకున్న పాస్‌ను అర్మాన్ ఖురేషి చక్కటి ఫీల్డ్ గోల్‌తో జట్టుకు 2-0తో ఆరంభాన్ని అందించాడు.
ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా గోల్స్‌గా మలచలేకపోయారు. అయితే రెండో క్వార్టర్ 24వ నిమిషంలో కళింగ బోణీ చేసింది. లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న మోరిట్జ్ తమకు లభించిన తొలి పెనాల్టీని గోల్‌గా మలవడంతో స్కోరు 2-1కి తగ్గింది. మూడో క్వార్టర్‌లో పంజాబ్ ఆటగాళ్లు చక్క టి సమన్వయంతో ముందుకు వెళ్లారు. దీంతో నాలు గు నిమిషాల వ్యవధిలో రెండు ఫీల్డ్ గోల్స్ నమోదయ్యాయి. 39వ నిమిషంలో మాట్ గోడెస్, 42వ నిమిషంలో సత్‌బీర్ గోల్స్ సాధించడంతో స్కోరు 6-1కి పెరిగింది. చివర్లో ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా సఫలం కాలేదు. రాంచీ రేస్‌తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-0తో విజయం సాధించింది.
అవార్డులు
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: రూపిందర్ పాల్ సింగ్ (ఢిల్లీ, రూ.50 లక్షలు)
అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు: గ్లెన్ టర్నర్(కళింగ లాన్సర్స్, రూ.20 లక్షలు)
ఫెయిర్ ప్లే అవార్డు: యూపీ విజార్డ్స్
అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సుమిత్