Punjab Warriors
-
దబంగ్ ముంబై చేతిలో పంజాబ్ వారియర్స్ ఓటమి
ఛండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై జట్టు షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 2–1తో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో 60వ నిమిషంలో రాబర్ట్ కెంపర్‌మన్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం)తో ముంబైని గెలిపించాడు. పంజాబ్ జట్టు తరఫున మింక్ వాన్‌డెర్ వీర్డెన్ 37వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో కళింగ లాన్సర్స్ తలపడుతుంది. -
ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు మరో పరాజయం
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2–3తో ఓడింది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ జట్టు మూడు ఓటములు, ఓ డ్రాతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. పంజాబ్ నుంచి 15వ నిమిషంలో వాన్‌డర్ హోర్ట్స్ ఫీల్డ్ గోల్ చేయగా 53వ నిమిషంలో వాన్‌డర్ వీర్డన్ మరో గోల్ సాధించాడు. ఢిల్లీ నుంచి వైట్ ట్రిస్టాన్ (39) ఫీల్డ్ గోల్ చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్‌తో ఢిల్లీ ఆడుతుంది. -
భారీ విజయంతో వారియర్స్ బోణీ
రాంచీ: భారత స్టార్ ఫార్వర్డ్ ఎస్వీ సునీల్ మెరుపు ప్రదర్శనతో నాలుగు గోల్స్ సాధించడంతో... హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ పంజాబ్ వారియర్స్ బోణీ చేసింది. దబంగ్ ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 4–10తో ఓడిపోయిన పంబాబ్... బుధవారం రాంచీ రేస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7–0తో ఘనవిజయం సాధించింది. ఆట 25వ నిమిషంలో మింక్ వాన్‌డెర్ వీర్డెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో వారియర్స్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ 26వ నిమిషంలో, 34వ నిమిషంలో రెండు ఫీల్డ్ గోల్స్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్‌ను రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో వారియర్స్ 5–0తో ముందంజ వేసింది. 43వ నిమిషంలో జేక్ వెటన్ ఫీల్డ్ గోల్ సాధించడంతో వారియర్స్ ఆధిక్యం 7–0కు పెరిగింది. గురువారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో దబంగ్ ముంబై తలపడుతుంది. -
ముంబై చేతిలో పంజాబ్‌కు షాక్
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ జేపీ పంజాబ్ వారియర్స్‌కు దబంగ్ ముంబై చేతిలో దారుణ పరాజయం ఎదురైంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 10–4 తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో అన్నీ ఫీల్డ్ గోల్సే నమోదు కావడంతో ఒక్కో గోల్‌కు రెండు పాయింట్లు లభించాయి. ముంబై నుంచి ఆరో నిమిషంలోనే నికిన్ తిమ్మయ్య గోల్‌తో జట్టు 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సునీల్ యాదవ్ (25), ఫ్లోరియన్ (30, 43), యూసుఫ్ (49, 50) గోల్స్ చేశారు. పంజాబ్ నుంచి గోడెస్ (13), అర్మాన్ ఖురేషి (44) చెరో గోల్ చేశారు. శనివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆడుతుంది. -
వారెవ్వా... వారియర్స్
హాకీ ఇండియా లీగ్ విజేత పంజాబ్ ఫైనల్లో కళింగ లాన్సర్స్‌పై గెలుపు రూ.2.50 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ రూపిందర్ రాంచీ: వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు చివరకు అనుకున్నది సాధించింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో నూతన చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 6-1 తేడాతో కళింగ లాన్సర్స్‌పై ఘనవిజయం సాధించింది. విజేతగా నిలిచిన పంజాబ్‌కు రూ. 2 కోట్ల 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కగా... రన్నరప్ కళింగకు రూ. కోటీ 75 లక్షలు లభించాయి. పంజాబ్ తరఫున అర్మాన్ ఖురేషి (4వ నిమిషంలో), మాట్ గోడెస్ (39), సత్బీర్ సింగ్ (42) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం)తో అదరగొట్టగా... కళింగకు లభించిన ఏకైక గోల్ కెప్టెన్ మోరిట్జ్ అందించాడు. రెండేళ్లుగా తుది మెట్టుపై బోల్తా పడుతూ వచ్చిన పంజాబ్ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రానీయకూడదనే కసితో తమ ఆటను ప్రారంభించింది. ఫలితంగా నాలుగో నిమిషంలోనే కళింగకు షాక్ తగిలింది. సర్కిల్లో బ్రౌన్ నుంచి అందుకున్న పాస్‌ను అర్మాన్ ఖురేషి చక్కటి ఫీల్డ్ గోల్‌తో జట్టుకు 2-0తో ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా గోల్స్‌గా మలచలేకపోయారు. అయితే రెండో క్వార్టర్ 24వ నిమిషంలో కళింగ బోణీ చేసింది. లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న మోరిట్జ్ తమకు లభించిన తొలి పెనాల్టీని గోల్‌గా మలవడంతో స్కోరు 2-1కి తగ్గింది. మూడో క్వార్టర్లో పంజాబ్ ఆటగాళ్లు చక్క టి సమన్వయంతో ముందుకు వెళ్లారు. దీంతో నాలు గు నిమిషాల వ్యవధిలో రెండు ఫీల్డ్ గోల్స్ నమోదయ్యాయి. 39వ నిమిషంలో మాట్ గోడెస్, 42వ నిమిషంలో సత్బీర్ గోల్స్ సాధించడంతో స్కోరు 6-1కి పెరిగింది. చివర్లో ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా సఫలం కాలేదు. రాంచీ రేస్‌తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ 2-0తో విజయం సాధించింది. అవార్డులు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్: రూపిందర్ పాల్ సింగ్ (ఢిల్లీ, రూ.50 లక్షలు) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు: గ్లెన్ టర్నర్(కళింగ లాన్సర్స్, రూ.20 లక్షలు) ఫెయిర్ ప్లే అవార్డు: యూపీ విజార్డ్స్ అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: సుమిత్ -
పంజాబ్‌తో కళింగ అమీతుమీ
సెమీస్‌లో ఓడిన రాంచీ రేస్, ఢిల్లీ హాకీ ఇండియా లీగ్ రాంచీ: డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) సెమీఫైనల్లోనే నిష్ర్కమించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ షూటౌట్ దాకా వెళ్లగా కళింగ లాన్సర్స్ 6-4తో రాంచీకి షాక్ ఇచ్చింది. దీంతో ఈ లీగ్‌లో తొలిసారిగా కళింగ ఫైనల్‌కు వెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో కళింగ జట్టు పంజాబ్ వారియర్స్‌ను ఢీకొంటుంది. అంతకుముందు నిర్ణీత సమయంలో కళింగ, రాంచీ జట్లు 2-2తో సమంగా నిలిచాయి. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. దీంట్లో మొదట రాంచీ రేస్ నుంచి కెప్టెన్ ఆష్లే జాక్సన్ తొలి ప్రయత్నాన్ని విఫలం చేయగా ఆ తర్వాత సర్వన్జిత్, మన్‌ప్రీత్ సింగ్ గోల్స్ చేశారు. అయితే నాలుగో షాట్‌ను మిడిల్టన్ గోల్‌గా మలచలేకపోయాడు. అటు కళింగ జట్టుకు కెప్టెన్ మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే, క్యాస్పర్స్, లలిత్, జలెక్సి వరుసగా చేసిన గోల్స్‌తో జట్టు ఫైనల్‌కు చేరింది. మూడోసారి పంజాబ్ ఫైనల్లోకి.. అంతకుముందు జరిగిన తొలి సెమీస్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై 3-1తో నెగ్గిన పంజాబ్ వారియర్స్ వరుసగా మూడోసారి ఫైనల్లోకి వెళ్లింది. ఢిల్లీ నుంచి రూపిందర్ పాల్ సింగ్ 6వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుకు అర్మాన్ ఖురేషి (13) ఫీల్డ్ గోల్ చేయగా సైమన్ ఆర్కర్డ్ (51) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ సా. 5.20 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
‘టాప్’లోకి వారియర్
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దబంగ్ ముంబై జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్ 5-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వారియర్స్ జట్టుకు పెనాల్టీ కార్నర్ల ద్వారా వరుణ్ కుమార్ (2వ నిమిషంలో), మార్క్ గ్లెగ్‌హార్న్ (13వ నిమిషంలో), క్రిస్టోఫర్ సిరియెలో (25వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించగా... 40వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించాడు. ముంబై జట్టు తరఫున జెరెమి హేవార్డ్ ఏకైక గోల్ చేశాడు. ప్రసుత్తం వారియర్స్, రాంచీ రేస్ 27 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నా, మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా వారియర్స్ జట్టు ‘టాప్’లోకి వచ్చింది. పట్నా ఘనవిజయం కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 47-34 తేడాతో దబాంగ్ ఢిల్లీపై ఘనవి జయం సాధించింది. దీంతో ఈ జట్టు 33 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీపక్ నర్వాల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 13 రైడ్, 2 టాకిల్ పాయింట్లు సాధిం చగా పర్దీప్ నర్వాల్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. ఢిల్లీ నుంచి సుర్జీత్ సింగ్ (10) మెరుగ్గా రాణించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 25-22 తేడాతో పుణెరి పల్టన్‌ను ఓడించింది. పుణె నుంచి అజయ్ ఠాకూర్ (11) రాణించాడు. -
పంజాబ్‌పై యూపీ విజయం
పంజాబ్పైయూపీ విజయం లక్నో: హాకీ ఇండియా లీగ్‌లో సొంతగడ్డపై ఉత్తరప్రదేశ్ (యూపీ) విజార్డ్స్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచింది. పంజాబ్ వారియర్స్‌తో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీ 4-1 గోల్స్ తేడాతో నెగ్గింది. 10వ నిమిషంలో మార్క్ గ్లెన్హార్న్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో పంజాబ్‌కు ఆధిక్యం లభించింది. 19వ నిమిషంలో యూపీ తరఫున పిలెట్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. 41వ నిమిషంలో పిలెట్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి యూపీని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 43వ నిమిషంలో ఆగస్టిన్ ఫీల్డ్ గోల్ (రెండు గోల్స్‌తో సమానం) చేయడంతో యూపీ 4-1తో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత యూపీ ఖాతాలో 23 పాయింట్లు ఉన్నాయి. దీంతో సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. -
వారియర్స్‌ను గెలిపించిన జాకబ్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టుకు షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్ 2-0 గోల్స్ తేడాతో రాంచీ రేస్ జట్టును ఓడించింది. ఆట రెండో నిమిషంలోనే జాకబ్ వెటన్ ఫీల్డ్ గోల్ చేశాడు. హెచ్ఐఎల్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్ చేస్తే దానిని రెండు గోల్స్‌గా పరిగణిస్తారు. దాంతో ఆరంభంలోనే వారియర్స్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ను చేయడంలో విఫలమయ్యాయి. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో పంజాబ్ వారియర్స్ తలపడుతుంది. -
ఫైనల్లో రాంచీ రేస్, పంజాబ్
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో రాంచీ రేస్, పంజాబ్ వారియర్స్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తుది పోరు నేడు (ఆదివారం) జరుగనుంది. లీగ్‌లో తొలిసారిగా అడుగుపెట్టిన రాంచీ రేస్... శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌పై పెనాల్టీ షూటవుట్స్ (9-8)లో నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. యూపీ తరఫున డ్రాగ్‌ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ (34వ ని.), రాంచీ నుంచి ఆష్లే జాక్సన్ (41వ ని.) గోల్స్ చేశారు. ఆ తర్వాత పెనాల్టీ షూటవుట్స్లోనూ ఫలితం తేలక 3-3తో స్కోరు సమమైంది. చివరకు సడెన్ డెత్‌లో రాంచీ రేస్ గట్టెక్కింది. ఇక మరో సెమీస్‌లో పంజాబ్ వారియర్స్ 2-0తో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ను ఓడించింది. సందీప్ సింగ్ (3వ ని.), ఆగస్టిన్ మజిలీ (35వ ని.) గోల్ చేశారు. మరోవైపు మూడో స్థానం కోసం ఢిల్లీ, విజార్డ్స్ తలపడనున్నాయి. -
వారియర్స్ ‘హ్యాట్రిక్’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో పంజాబ్ వారియర్స్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో నెగ్గింది. పంజాబ్ తరఫున సిరియెల్లో, సునీల్, యూసుఫ్ ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీకి సిమోన్ చైల్డ్ ఏకైక గోల్ అందించాడు. పంజాబ్ 17 పాయింట్లతో లీగ్‌లో అగ్రస్థానంలో ఉంది.