డాబు మనది..... డబ్బువాళ్లది......
జాతీయ జట్టులో చోటు లేదా...?
ఫర్వాలేదు ఐపీఎల్ ఉందిగా...
ఒక విదేశీ క్రికెటర్ ఆలోచన.
ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేశాను, ఇక చేసేదేముంది... ఇబ్బందేమీ లేదు ఇండియన్ సూపర్ లీగ్‌లో ఆడుకోవచ్చు...
ఒక ఫుట్‌బాలర్ మనోగతం.
హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్... భారత్‌లో జరిగే ఏ లీగ్‌లోనైనా బరిలోకి దిగేందుకు విదేశీ ఆటగాళ్లు సిద్ధం. ఇక్కడి లీగ్‌లు వారికి బంగారు బాతుగుడ్లుగా మారాయి. పేరు చూస్తే ఇండియన్... నిర్వహణ, ఏర్పాట్లు, హడావిడి, హంగామా అంతా భారతీయులదే. కానీ మన ఆటగాళ్లకు మాత్రం ఆర్థిక పరంగా దక్కుతోంది అంతంత మాత్రమే. తక్కువ సంఖ్యలో ఉన్నా... విదేశీ క్రీడాకారులు కొల్లగొడుతోంది చాలా ఎక్కువ మొత్తమే.
సాక్షి క్రీడా విభాగం ప్రస్తుతం భారత్‌లో ఏడు క్రీడాంశాల్లో ఎనిమిది రకాల లీగ్‌లు నడుస్తున్నాయి. ఐపీఎల్, ఐఎస్‌ఎల్, హాకీ ఇండియా లీగ్, ప్రొ కబడ్డీ లీగ్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, ప్రొ రెజ్లింగ్, ఐపీటీఎల్, సీటీఎల్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ లీగ్‌లలో ఆటగాళ్లకు చెల్లిస్తున్న డబ్బుకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ‘ఇండియన్ స్పోర్ట్స్ సాలరీస్ రిపోర్ట్ 2016’ దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహించింది. ఆయా టోర్నీల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాల జోలికి వెళ్లకుండా కేవలం ప్లేయర్లు ఎంత సంపాదిస్తున్నారనేదానిపైనే ఈ నివేదిక రూపొందింది. సాధారణంగా అందరూ అనుకునే విధంగా ఐపీఎల్‌లో ఆడుతున్న ఆటగాళ్లు ఎక్కువ మొత్తం సంపాదించడం లేదు. ఈ స్థానం టెన్నిస్ ఆటగాళ్లది. మొత్తంగా భారత లీగ్‌ల సొమ్ముతో విదేశీయులు ‘పండగ’ చేసుకుంటున్నారు.
►ఎనిమిది లీగ్‌లలో కలిపి ఆటగాళ్లకు చెల్లిం చేందుకు ప్రతీ ఏటా రూ. 1100 కోట్లు అందుబాటులో ఉంటున్నాయి. 2015 భారత క్రీడా బడ్జెట్‌లో ఇది 75 శాతం.
► గత ఏడాది ఆటగాళ్లకు రూ. 823 కోట్లు ఇచ్చారు.
►మొత్తం 857 మంది ప్లేయర్లలో 521 మంది భారతీయులు, 336 మంది విదేశీయులు ఉన్నారు.
►రూ. 527 కోట్లు విదేశీ ఆటగాళ్లు (64 శాతం) తీసుకుంటుండగా, భారత ఆటగాళ్లకు లభించిన మొత్తం 296 కోట్లు మాత్రమే (36 శాతం)
►రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఒక్కొక్కరు ఐపీటీఎల్‌లో రూ. 26 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. ఐపీఎల్‌లో ధోని, కోహ్లి కలిసి పొందే మొత్తం కంటే ఎక్కువ. ప్రొ కబడ్డీ లీగ్, రెజ్లింగ్ లీగ్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లు మూడింటిలో కలిపి ఆటగాళ్లకు ఇస్తున్న మొత్తం...ఫెడరర్, నాదల్‌కు కలిపి ఇచ్చేదానికంటే తక్కువే. హాకీ లీగ్‌లో ఆటగాళ్లందరికీ ఇచ్చే డబ్బు కలిపితే ఒక్క ఫెడరర్‌కు ఇచ్చేదానికి సరిపోతుంది.
►ఐపీటీఎల్‌లోని ఆరుగురు ఆటగాళ్లు నిమిషానికి రూ. 6 లక్షల చొప్పున సంపాదిస్తున్నారు. వీరిలో అత్యధికంగా ఆండీ ముర్రే నిమిషానికి రూ. 14.34 లక్షలు ఆర్జించడం విశేషం.
►భారత ఆటగాళ్లలో రెజ్లర్ యోగేశ్వర్‌దత్ నిమిషానికి రూ. 1.65 లక్షలు అందుకున్నాడు.
►క్రికెటర్లలో గత ఏడాది ఐపీఎల్‌లో రూ. 16 కోట్ల విలువ పలికిన యువరాజ్ సింగ్‌కు నిమిషానికి రూ 1.01 లక్ష చొప్పున అందాయి. అయితే ఆర్జనలో దీనికి 17వ స్థానం మాత్రమే దక్కింది. కోహ్లి, ధోని, రైనాలైతే నిమిషానికి రూ. 75 వేలు మాత్రమే సంపాదించారు.
►భారత్‌లోని లీగ్‌లలో అత్యధికంగా ఐపీఎల్‌లో ఆటగాళ్లకు రూ. 420 కోట్లు లభిస్తున్నాయి. సగటున ఒక్కో క్రికెటర్‌కు ఏడాదికి రూ. 2.48 కోట్లు దక్కుతోంది.
►జట్టుపరంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 63.5 కోట్లు, ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ రూ. 63.36 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నాయి.
►తక్కువ మొత్తం చెల్లిస్తున్నా, సోషల్ మీడియాలో ప్రచారపరంగా ఎక్కువ విలువను తెచ్చి పెట్టగల ఆటగాళ్ల జాబితాలో గుత్తా జ్వాలకు అగ్రస్థానం దక్కగా, క్రికెటర్లలో సెహ్వాగ్ ముందున్నాడు.