
న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక సిబ్బందిలో మరో కొత్త వ్యక్తి చేరాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను క్యాపిటల్స్ మెంటార్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. 2009–2016 మధ్య పీటర్సన్ ఐపీఎల్ 36 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మూడు సీజన్ల పాటు ఢిల్లీ (క్యాపిటల్స్) తరఫునే ఆడిన అతను బెంగళూరు, పుణే జట్లకూ ప్రాతినిధ్యం వహించాడు. 17 మ్యాచ్‌లలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ 11 ఏళ్ల తర్వాత అదే జట్టుకు ఇప్పుడు మెంటార్ బాధ్యతలు చేపడుతున్నాడు.
ఓవరాల్‌గా టి20 కెరీర్‌లో పీటర్సన్ 200 మ్యాచ్‌లు ఆడి 5,695 పరుగులు సాధించాడు. ఆటగాడిగా ఐపీఎల్ కెరీర్ ముగించిన తర్వాత కూడా ఢిల్లీ టీమ్ యాజమాన్యంతో పీటర్సన్ మంచి సంబంధాలు కొనసాగించాడు. ఇంగ్లండ్‌లోని ప్రతిష్టాత్మక కౌంటీ టీమ్‌ను జీఎంఆర్ యాజమాన్యం కొనుగోలు చేయడంలో మధ్యవర్తిగా పీటర్సన్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఐపీఎల్‌లో మళ్లీ మరో హోదాలో అడుగు పెడుతున్నాడు.