
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్‌ఎస్‌జీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు.
ఈసారి ఎల్‌ఎస్‌జీ జట్టు కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్‌ఎస్‌జీ జట్టు శనివారం ప్రాక్టీస్ చేయనుంది. ఎల్‌ఎస్‌జీ జట్టుకు మెంటర్‌గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్‌గా లాంగర్, సహాయ కోచ్‌లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు.
ఆల్‌రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్‌లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయా ల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్‌లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి.
రాహుల్ రానట్టేనా?
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే.! దీంతో ఎల్‌ఎస్‌జీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment