రిషభ్ పంత్ (PC: BCCI/IPL)
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్‌కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్‌కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్‌కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు.
ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్‌గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది.
ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్‌కే చోటివ్వాలి!
‘‘వరల్డ్‌కప్ జట్టులో రిషభ్ పంత్‌కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు.
టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు.
చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా వరల్డ్‌కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు సాధించాడు.
చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
Comments
Please login to add a commentAdd a comment